ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…వైసీపీ హయాంలో తెచ్చిన ఈ యాక్ట్ పేరు చెప్పగానే ప్రజలు వణికిపోయారు. అందుకే, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. ప్రజల భూములు, స్థలాలకు రక్షణ లేకుండా చేసే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమి ప్రకటించింది. అన్న మాట ప్రకారమే తాజాగా ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టగా దానికి ఎన్డీఏ సభ్యులంతా ఆమోదం తెలిపారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక్క ఆంగ్ల పదం ఉపయోగించకుండా సభా వ్యవహారాలు నడిపించడంతో సభ్యులందరూ ఆయనను అభినందించారు. “మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే… ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు-2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి… వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి” అని అయ్యన్నపాత్రుడు అచ్చ తెలుగులో మాట్లాడడం కొసమెరుపు. వాస్తవానికి ఇంగ్లిషులో ఆయ్స్..నోస్..అని సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు.
సభ్యులంతా ఈ బిల్లుకు అందరూ అవును అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. దీంతో, వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు చెల్లుచీటీ పడినట్లయింది.