కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా ద్వారంపూడి ఉంటారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. కాకినాడ పోర్టు కేంద్రంగా వేలాది టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిపోతున్న వ్యవహారంలో ద్వారంపూడిదే కీలక పాత్ర అని గతంలో ఆరోపణలు వచ్చాయి. కొడాలి నాని, ద్వారంపూడి, విజయసాయి అల్లుడు కుమ్మక్కై లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్నారని, ఆ బియ్యం ఎగుమతులపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ నేతలు గతంలో డిమాండ్ చేశారు.
ఇక, వైసీపీ నేతల అక్రమాలను ఎండగడుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ పై కూడా ద్వారంపూడి గతంలో సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. పవన్ ప్యాకేజీలు మాట్లాడుకుంటారని, జనసేన కోసం డబ్బులు ఖర్చుపెడుతున్న నేతలను పవన్ మోసం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ద్వారంపూడిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన భూములను ద్వారంపూడి కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
కాకినాడ ఎడ్యుకేషన్ సొసైటీకి విరాళాల ద్వారా వచ్చిన సొమ్ముతో 13.74 ఎకరాల భూమి కొన్నారని, విలువైన ఆ భూములపై ద్వారంపూడి కన్ను పడిందని ఆరోపించారు. కౌన్సిల్ మీటింగ్లో ఆ భూములను నివాసయోగ్యమైన స్థలాలుగా తీర్మానించారని ఆరోపించారు. చేయించుకొన్నారు. ఆ భూములను ఆయన కబ్జా చేసి వాటిలో లేఅవుట్ ఏర్పాటు చేసి అమ్మేసుకొందామని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆ ప్రయత్నాన్ని తాను అడ్డుకుంటానని, కోర్టును ఆశ్రయిస్తానని వనమాడి కొండబాబు హెచ్చరించారు. ద్వారంపూడికి సహకరించినందుకు కౌన్సిల్ సభ్యులు, కార్పొరేషన్ కమీషనర్ పై కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అధికార పార్టీ అండదండలతో ద్వారంపూడి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.