రెండు రోజుల్లో బ్రేకప్..మరో రెండు రోజుల్లో ప్యాచప్…ఇదీ సింపుల్ గా రెండు ముక్కల్లో ‘లవ్’ ఆజ్ కల్. ఈ మోడర్న్ జమానాలో ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో…ఎప్పుడు ఆ రిలేషన్ షిప్ బోర్ కొడుతుందో చెప్పడం కష్టం. ఇక, ఏ వయసులో ప్రేమ దోమ కుడుతుందో చెప్పడం ఇంకా కష్టం. ఈ కోవలోనే ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ల మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ పుట్టింది.
తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని 2 నెలల క్రితం లలిత్ మోడీ చెప్పడంతో అంతా షాకయ్యారు. కట్ చేస్తే తాజాగా వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని లలిత్ మోడీ చెప్పకనే చెబుతుండడంతో అందరూ అంతకన్నా ఎక్కువ షాకవుతున్నారు. సుష్మితా సేన్‌తో డేటింగ్ విషయాన్ని స్వయంగా చెప్పి మోడీ…తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుష్మితతో దిగిన ఫోటోను ఉంచారు. ఆ తర్వాత తన బయోలో సుష్మితా సేన్ ను తన లవర్ గా పేర్కొన్నారు.
సీన్ కట్ చేస్తే…2 నెలల్లో అంతా మారిపోయింది. తన ఇన్‌స్టా డీపీలో సుష్మితా సేన్ తో దిగిన ఫోటోను తీసేసిన మోడీ తన ఫోటో మాత్రమే పెట్టుకున్నారు. అంతేకాదు, బయోలో కూడా లవర్ ప్లేస్ నుంచి సుష్మిత పేరు తీసిపడేశారు. దీంతో, ఈ లవ్ స్టోరీకి బ్రేక్ పడిందని, ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని టాక్ వస్తోంది. అయితే…సుష్మితతో లలిత్ మోడీ దిగిన ఫోటోలు మాత్రం ఆయన సోషల్ మీడియా ఖాతాలో అలాగే ఉన్నాయి.
ఇక, సుష్మితా సేన్ దత్త పుత్రిక రీనా పుట్టినరోజు సందర్భంగా ఆమె మాజీ ప్రేమికులు రోమన్ షాల్, రితిక్ బాసిన్ లు సుష్మితను కలిశారు. వారం రోజుల క్రితం కూడా కుమార్తె, రోమన్ షాల్‌తో సుష్మితా సేన్ కనిపించారు. దీంతో, రోమన్ షాల్ కు సుష్మిత మళ్ళీ దగ్గరైందని, అందుకే లలిత్ కు బ్రేకప్ చెప్పిందని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, లలిత్, సుష్మితా సేన్ లు తమ బ్రేకప్ గురించి అఫీషియల్ గా ప్రకటన చేయలేదు.