జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశారని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ నేతల అండతో లక్ష్మి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆమెకు తాను డబ్బులు చెల్లించానని కిరణ్ రాయల్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం తిరుపతి ఎస్పీకి కిరణ్ రాయల్ పై లక్ష్మి గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు.
తనకు న్యాయం చేసి, తనకు రావాల్సిన కోటీ 20 లక్షలు ఇప్పించాలని ఎస్పీని కోరారు. కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆ తర్వాత కాసేపటికే లక్ష్మిని చెక్ బౌన్స్ కేసులో జైపూర్ పోలీసులు అరెస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ పై లక్ష్మి షాకింగ్ ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ మాయ మాటలకు మోసపోయానని, తనపై లక్ష రూపాయలకు చెక్ బౌన్స్ కేసు ఉందని ఆమె చెప్పారు. తన బిడ్డకు సర్జరీ కోసం డబ్బులు అడిగితే తన దగ్గర నుంచి ఖాళీ చెక్ తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. తనపై కిలేడీ అంటూ నిందలు వేస్తున్నారని, తనను ఎంతో అవమానించారని వాపోయారు. అంతేకాదు, ఇన్నాళ్లూ తనను చంపేస్తాడేమో అని మీడియా ముందుకు రాలేదని చెప్పారు. కానీ, తనలా చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం కాకూడదని ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చానని అన్నారు.
తన వెనక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని కిరణ్ రాయల్ బెదిరించినట్లు లక్ష్మి ఆరోపించారు. ఎన్నికలవగానే తన దగ్గర తీసుకున్న నగదు తిరిగి ఇచ్చేస్తా అని చెబితే నమ్మి మోస పోయానని చెప్పారు. మానస అనే అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడని ఆరోపించారు. ఆ తర్వాత తనతో రిలేషన్ లో ఉన్నాడని, తనతో గొడవయ్యాక ఇంకో అమ్మాయి ని మోసం చేశాడని ఆరోపించారు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టవద్దనుకుని ఇన్నాళ్లు బయట పెట్టలేదని అన్నారు.
తనకు ఏ పార్టీ మద్దతు లేదని, తనకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి నీచుడ్ని వదిలి పెట్టొద్దని, ఎంత మంది జీవితాలు నాశనం చేస్తాడో తెలీదని లక్ష్మి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ చెక్ బౌన్స్ కేసు విషయంలో సైలెంట్ గా ఉన్న జైపూర్ పోలీసులు ఇప్పడు హఠాత్తుగా లక్ష్మిని అరెస్టు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.