వైసీపీ అధినేత జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈయనతోపాటు దేశవ్యాప్తంగా 4 వేల మందికి పైగా ప్రజాప్రతినిధులు ఇదే తరహా కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 42 మందిపై కేసులు 30 ఏళ్లుగా నానుతూనేఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసుల విచారణను ముందుకు తీసుకువెళ్లాలని, వేగం పెంచాలని కోరుతూ.. పలు వ్యాజ్యాలు సుప్రీంకోర్టుకు చేరాయి. చిత్రం ఏంటంటే.. ఈ వ్యాజ్యాలు కూడా.. 2016 నుంచి కోర్టుల్లో నానుతూనే ఉన్నాయి.
వీటిపై తాజాగా మరోసారి విచారించిన సుప్రీంకోర్టు.. క్రిమినల్ సహా అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. “క్రిమినల్ కేసులు నమోదైతే.. సాధారణ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావు కదా? అలాంటిది .. వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు? దీనికి ప్రాతిపదిక ఏంటి? “ అని నిలదీసింది. ప్రభుత్వం తరఫున కోర్టు సహాయకుడిగా నియమితులైన హన్సారియాపై ప్రశ్నల వర్సం కురిపించింది.
“నేరాలు చేసి.. ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారని మీరే చెబుతున్నారు. అసలు ఇలాంటి వారిని ఎన్నికల నుంచిఎందుకు మినహాయించకూడదో చెప్పండి“అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఇలాంటి నేరస్తుల కారణంగా ప్రజాస్వామ్యం బలహీన పడుతుందన్న విషయం మీకు(ప్రభుత్వానికి) తెలియదా? అని ప్రశ్నించింది. నేరస్తులపై కేసుల విచారణ వేగంగా ముందుకు సాగాలన్నదే తమ ఉద్దేశం కూడా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అయితే.. అసలు నేరస్తులు ప్రజలను పాలించేందుకు అనుమతించకపోతే.. ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా? అని పేర్కొంది. దీనిపై పక్కా చట్టాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా.. స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి విషయంలోనూ కోర్టులపై ఆధారపడడం కంటే.. ప్రభుత్వం-ఎన్నికల సంఘం సంయుక్తంగా ఆచరణ యోగ్యమైన నిర్ణయం తీసుకుని నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేరా? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.