మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేదు. ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి పేరు… ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనకు ముందు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు ముందు లగడపాటి దీక్ష ఎపిసోడ్, పార్లమెంటులో పెప్పర్ స్ప్రే ఎపిసోడ్ ….అప్పట్లో సంచలనం రేపాయి. రాష్ట్రవిభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన లగడపాటి….ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నమాట ప్రకారం రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
చాలాకాలంగా మీడియాకు కూడా లగడపాటి దూరంగా ఉంటూ ఎటువంటి రాజకీయ వ్యవహారాలపైనా స్పందించడం లేదు. దీంతో, లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని అంతా అనుకున్నారు. అయితే, లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్నా…అది పుకారుగానే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే లగడపాటి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2024 ఎన్నికల్లో లగడపాటి పోటీ చేస్తారని, విజయవాడ లేదా గుంటూరు ఎంపీ టికెట్ లగడపాటికి దక్కనుందని టాక్ వస్తోంది. ఇప్పటికే ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ లకు రెండుసార్లు వరుసగా ఎంపీ టికెట్ ఇచ్చారని, కాబట్టి వారిద్దరికీ అసెంబ్లీ టికెట్ లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా కేశినేని నాని…పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో లగడపాటిని నాని స్థానంలో బరిలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్న ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే తాజాగా లగడపాటి ఎన్టీఆర్ జిల్లా పర్యటన తీవ్ర చర్చనీయాంశమైంది. నందిగామ ప్రాంతంలో పర్యటించిన మాజీ ఎంపీ..పలువురు రాజకీయ నాయకులతో బిజీబిజీగా గడిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తోపాటు వైసీపీ, కాంగ్రెస్ నేతలతోనూ లగడపాటి సమావేశమయ్యారు. ఓ వైసీపీ నేత ఇంట వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, ఎమ్మెల్యే వసంత హాజరైన సందర్భంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, వైసీపీ నాయకులను లగడపాటి కలుసుకున్నారు.
అలాగే, ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు మంగులూరి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు. రాజకీయ నాయకులతో వరుస సమావేశాల నేపథ్యంలో లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇదే విషయాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని లగడపాటి తేల్చి చెప్పడం కొసమెరుపు.