తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ల లిస్ట్ తీస్తే.. అందులో ‘లేడీస్ టైలర్’ కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ డైరెక్టర్ వంశీ రూపొందించిన ఈ చిత్రంలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆయనకు జోడీగా అర్చన కూడా బలమైన ముద్రే వేసింది. ఐతే ఒక హిట్ సినిమాలో జంటగా నటించిన హీరో హీరోయిన్లతో మళ్లీ సినిమాలు తీయడం మామూలే. కానీ ‘లేడీస్ టైలర్’ జంట ను మాత్రం మళ్లీ ఏ దర్శకుడూ ఒక సినిమాలో కలిపి చూపించలేదు.
ఐతే ఈ ఇద్దరూ 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి నటించబోతుండటం విశేషం. వీరి కలయికలో ‘షష్ఠి పూర్తి’ అనే సినిమా రాబోతోంది. పవన్ ప్రభ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆమెకు జోడీగా రూపేష్ కుమార్ చౌదరి నటిస్తున్నాడు. అతనే ఈ చిత్రానికి నిర్మాత కూడా. ఈ చిత్రానికి ఇసై జ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చనుండటం విశేషం.
రాజేంద్ర ప్రసాద్ హీరో వేషాలు వదిలేశాక చాలా వరకు కామెడీ, క్యారెక్టర్ రోల్సే చేస్తూ వస్తున్నాడు. అప్పుడప్పుడూ ఆయన ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలు వస్తున్నాయి. కానీ అవేవీ పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఈ మధ్యే ఆయన ప్రధాన పాత్రలో ‘అనుకోని ప్రయాణం’ అనే సినిమా రిలీజైంది. కానీ దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయినా ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టి సినిమా తీయడం అంటే సాహసమే. అర్చన చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది.
ఈ మధ్యే ‘చోర్ బజార్’ అనే సినిమాతో తెలుగులోకి ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రాజేంద్ర ప్రసాద్‌తో ఇన్నేళ్ల కలిసి నటించడం ఆసక్తి రేకెత్తించేదే. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్‌కు అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఇళయరాజా.. ఇప్పుడు ఆయన సినిమాకు ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందట.