స్నేహితుడంటే ఎలా ఉండాలన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా వ్యవహరిస్తూ.. ఆయన తలలో నాలుకలా ఉన్న కేవీపీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టి.. తన సత్తా చాటాలని ఎంతలా ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయిన టీవైసీపీ అధినేత్రి షర్మిలకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు కేవీపీ.
ఇటీవల కాలంలో ఆమె టీకాంగ్రెస్ లోకి చేరుతుందన్న మాట తరచూ వినిపిస్తున్న వేళ.. ఆ అంశం అధికారికం ఉన్నట్లుగా కేవీపీ వ్యాఖ్యలు ఉన్నాయి. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిల జాయిన్ కానున్న విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సమాచారం తనకు ఉందన్న ఆయన.. గన్నవరం ఎయిర్ పోర్టుకు ఆదివారం రాత్రి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ గన్నవరం వచ్చిన సందర్భంగా.. ఆయన్నను కలిసేందుకు కేవీపీ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన షర్మిల ఫ్యూచర్ ప్లాన్ ఇదేనన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ వాదిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావటాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పిన కేవీపీ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీకి స్థానిక పరిస్థితుల్ని వివరిస్తామన్నారు.
2024లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని.. 2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందునే కాంగ్రెస్ నష్టపోయిందన్నారు. ఏపీలో పార్టీని ఇటుక ఇటుకను పేరుస్తున్నట్లు చెప్పిన కేవీపీ.. విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి చేయకుండా అధికార వైసీపీ.. విపక్ష టీడీపీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని.. కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి చేస్తున్న అన్యాయాల్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.