తమిళనాడులో ప్రముఖ సినీ తారలు ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రి రఘురాంలపై డిఎంకె నేత సైదా సిద్ధికి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బిజెపిలో చేరిన ఆ నలుగురిని ఉద్దేశించి రాజకీయాల్లోకి వచ్చిన ఐటెంలు అంటూ సిద్దికి చేసిన కామెంట్లు కోలీవుడ్ తో పాటు తమిళనాట కాకరేపుతున్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలకు స్పందించిన డీఎంకే మహిళా నేత కనిమొళి….ఆ నలుగురికి క్షమాపణ చెప్పారు.
అంతేకాదు, ఈ వ్యవహారంపై సిద్ధికి కూడా ఆ నలుగురికి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అయినా సరే వారి మనసు గాయపడి ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అదే సమయంలో బిజెపి నాయకత్వం చేస్తున్న వ్యాఖ్యలపై ఎవరు ఎందుకు స్పందించడం లేదని సిద్ధికి ప్రశ్నించారు. తాను ఎవరి మనోభావాలు గాయపరచాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.
కానీ, కనిమొళి, సిద్ధిఖీలు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఖుష్బూ ఇంకా కోపంగానే ఉన్నారు. సిద్ధికి వ్యాఖ్యల పట్ల సీఎం స్టాలిన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఖుష్బూ ప్రశ్నించారు. ఇది దేనికి సంకేతం అని ఖుష్బూ అన్నారు. అంతేకాదు, తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సిద్ధికిని వదిలేది లేదని, ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్తానంటూ ఖుష్బూ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధికిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ ఖుష్బూ సంకేతాలు ఇచ్చారు. ఇది తమ గౌరవం, మర్యాదలకు సంబంధించిన విషయమని ఖుష్బూ అన్నారు.