ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హతలపై కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో లా కాలేజీలో అడ్మిషన్ పొందారని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఏపీ, తెలంగాణ గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సింగ్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్, సీఎం జగన్ లకు రవికుమార్ లేఖలు రాశారు.
స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ లోని ఎల్బీనగర్ మహాత్మా గాంధీ లా కాలేజీలో 2019-20 లో సీతారాం అడ్మిషన్ తీసుకున్నారని ఆ లేఖలో రవికుమార్ పేర్కొన్నారు. అయితే లా కోర్సులో లో చేరాలంటే డిగ్రీ లేదా తత్సమాన కోర్స్ పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీగానీ, మరే తత్సమాన కోర్సుగానీ చదవలేదని ఆరోపించారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా తమ్మినేని వెల్లడించారని కూన గుర్తు చేశారు.
అంతేకాకుండా, 2019 ఎన్నికల అఫిడవిట్లో కూడా ఈ విషయాన్ని తమ్మినేని పేర్కొన్నారని గుర్తు చేశారు. శ్రీకాకుళం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ మధ్యలో మానేశానని తమ్మినేని స్వయంగా వెల్లడించారని లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు, తమ్మినేని లా పరీక్షలకు హాజరైనట్లు దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను కూడా ఆయన ఆ లేఖకు జత చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తమ్మినేని వంటి వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకోవడం సరికాదని, కాబట్టి ఆయన శిక్షారుడని కూన ఆరోపించారు. తమ్మినేనిపై కఠిన చర్యలు తీసుకొని చట్టం ముందు అందరూ సమానమే అని చాటిచెప్పాలని ఆ లేఖలో కోరారు.