మరికొద్ది నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రయత్నిస్తుండగా…ఈసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష నేతలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చూసేది కాదని. ప్రతిపక్షాలకు 2023లో చూపించేది అని కేటీఆర్ తనదైన శైలిలో పదునైన విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో కులమతాల చిచ్చు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
విశ్వ నగరంగా హైదరాబాద్ అవతరిస్తుందని, అందుకే మతకలహాలు రేపి అల్లర్లు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందాలన్నా, కులమత బేధాలు లేకుండా ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలన్నా మరోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని, ప్రజల ఆశీస్సులు ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ చెప్పారు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి వీఎస్టి వరకు 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
450 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జికి మాజీ మంత్రి, దివంగత నేత నాయిని నరసింహారెడ్డి పేరును పెట్టారు. సిగ్నల్ రహిత ప్రయాణం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 48 ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. భూ సేకరణ చేపట్టకుండా పూర్తిగా ఉక్కుతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం. దక్షిణాదిలో అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా ఇది రికార్డులకు ఎక్కింది. ఈ బ్రిడ్జి రాకతో విఎస్టి జంక్షన్, ఆర్ టి సి క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్ రోడ్స్ మార్గాలలో వాహనాల రద్దీ తగ్గనుంది.