మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, కేటీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వ్యవహారాలలో సీఎం కేసీఆర్ బిజీగా ఉండడంతో మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ ప్రయత్నాలలో భాగంగా విపక్ష పార్టీలకు కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారు. నియోజకవర్గానికి చెందిన ఒక బీజేపీ నేత మద్దతు కోరుతూ కేటీఆర్ చేసిన ఫోన్ కాల్ లీక్ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
గట్టుప్పల్ బీజేపీ ఇన్ చార్జి జగన్నాథానికి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ గెలుపు కోసం సహకరించాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి గురించి తన కంటే జగన్నాథానికే ఎక్కువ తెలుసని, కోమటిరెడ్డి నిజమైన బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్త కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదని, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేది లేదని, తాను పని చేసే సహకారాన్ని అడుగుతున్నానని, డొల్ల మాటలు చెప్పి అడగడం లేదని అన్నారు.
మునుగోడులో 79 వేల మందికి రైతు బంధు వస్తుందని కేటీఆర్ చెప్పగా…రైతుబంధుకు లిమిట్ ఉండాలని, చిన్న రైతులకే రైతుబంధు ఇవ్వాలని జగన్నాథం అన్నారు. వందల ఎకరాలు ఉన్నవాళ్లకు ఇస్తే పెద్దపెద్ద రైతులు, పెట్టుబడిదారులే బాగుపడతారని చెప్పారు. అయితే, కేటీఆర్ ఫోన్ కాల్ ను జగన్నాథం స్పీకర్ ఆన్ చేసి మాట్లాడగా…దానిని పక్కనున్న మరో వ్యక్తి రికార్డు చేశారు. ఈ వీడియోను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ లో షేర్ చేసి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. నిరాశలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఫోన్లు చేస్తూ విపక్ష నేతలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
A very desperate CMs son Rama Rao making phone calls to lure opposition leaders, ending up looking foolish.#Munugodu@bandisanjay_bjp@Arvindharmapuri@drlaxmanbjp@kishanreddybjp@Arvindharmapuri@trspartyonline@BJP4Telangana@toi@DeccanChronicle@htTweets@ntv@Tolivelugu pic.twitter.com/NrqjAIEoiM
— Konda Vishweshwar Reddy (Modi Ka Parivar) (@KVishReddy) October 18, 2022