ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయ దుమారానికి కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. రా.గా పర్యటన సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే వరంగల్ లో నిన్న జరిగిన రైతు సంఘర్షణ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తెలంగాణను దోచుకున్న దొంగలతో తాము పొత్తు పెట్టుకోబోమని, ఆ మాటకొస్తే అసలు తమకు ఏ పార్టీతో పొత్తు లేదని రాహుల్ అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీకి అంటే ఆలిండియా క్రైసిస్ కమిటీ అంటూ ఎద్దేవా చేసిన కేటీఆర్…కాంగ్రెస్ ఒక కాలం చెల్లిన పార్టీ అని చురకలంటించారు. అసలు, దేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీ దేశంలో ఏదైనా ఉందా? అని సెటైర్లు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కావాలని ఎవరైనా అడిగారా? అని చమత్కరించారు. రాహుల్ గాంధీపై కూడా కేటీఆర్ పంచ్ లు వేశారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని రాహుల్ చదివారని, సొంత నియోజకవర్గంలో ఎంపీగా ఓడిన రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తారా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ చెప్పినట్లు కాంగ్రెస్ అంత గొప్ప రైతుపక్షపాత పార్టీ అయితే పంజాబ్ లో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. వరంగల్ లో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ లో కొత్త అంశాలేవీ లేవని, ఆ పార్టీ నేతల మాటలు నమ్మవద్దని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరి, కేటీఆర్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చంచల్ గూడ జైలులో విద్యార్థి సంఘం నాయకులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ తో రేవంత్ కు బదులు భట్టి విక్రమార్కను ఏఐసీసీ అధిష్టానం పంపడం టీకాంగ్రెస్ లో కొత్త చర్చకు తెరతీసింది. ఈ క్రమంలో కేటీఆర్ కామెంట్లకు రేవంత్ కౌంటర్ ఇస్తారా లేదంటే భట్టి స్పందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.