దూకుడు ఉండాల్సిందే. రాజకీయాల్లో ఈ తీరు అవసరం. గతానికి మించి వర్తమానంలో దూకుడు రాజకీయాలకు ప్రజలు సైతం ఓటేస్తున్న పరిస్థితి. మంచిగా మాట్లాడుతూ.. ఎదుటోడి దూకుడ్ని పోన్లే.. అన్నట్లుగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని చేతకానివారిలా చూడటం ఈ మధ్యన ఎక్కువైంది. ఎదుటోడు రెండు అన్నప్పుడు.. కనీసం నాలుగు అనకపోతే బాగోదన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే.. అన్ని సందర్భాల్లోనూ దూకుడుతనంతో పెద్దగా ప్రయోజనం ఉండదు. తాజాగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్ని చూసినప్పుడు.. బావబామ్మర్దుల స్పీడు , దూకుడుతనం అందరిని విస్మయానికి గురి చేసింది.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఇంకా వాస్తవం తెలిసి రాలేదన్నట్లుగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడి.. తమ బలం 39 స్థానాలకే పరిమితమైన వేళ.. ప్రజలు తమను రిజెక్టు చేశారన్న సత్యాన్ని ఇంకా జీర్ణించుకోలేదన్నట్లుగా వారి తీరు ఉంది. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. మీ ఆయుష్షు మూడు నెలలే అంటూ ప్రకటనలు చేయటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి. ఇలాంటి ప్రకటలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళలో.. సభలో బుల్ డోజ్ చేసినట్లుగా మాట్లాడేస్తున్న వైనాన్ని కాంగ్రెస్ సహనంతో భరిస్తుందన్న విషయాన్ని గులాబీ పరివారం మర్చినట్లుగా కనిపిస్తుంది.
ఇప్పటివరకు జరిగినట్లు కాకుండా.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలన్నట్లుగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తోంది. అదే లేకుంటే.. కేటీఆర్.. హరీశ్ లు ఇంతలా మాట్లాడేవారా? దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని స్పీకర్లు ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో తెలియంది కాదు. అలాంటప్పుడు తెలంగాణలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉందంటే దానికి కారణం.. సంప్రదాయబద్ధంగా సభను నిర్వహించటం ద్వారా కొత్త స్పూర్తిని రగిలించాలన్నదే లక్ష్యమని చెప్పాలి.
శనివారం వరకు సాగిన అసెంబ్లీ సమావేశాల్ని చూసిన రాజకీయ పక్షాలు.. మీడియా ఒకలా స్పందిస్తే.. సామాన్య ప్రజానీకం స్పందన మరోలా ఉంది. రాజకీయ.. మీడియా వర్గాలకు మాత్రం కేటీఆర్.. హరీశ్ ల దూకుడు కొత్తగా ఉందని చెప్పటమే కాదు.. అధికారపక్షం ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపించిందని పేర్కొన్నారు. ఇదే తీరులో మరికొంతకాలం సాగితే.. కేసీఆర్ అండ్ కో చెప్పినట్లుగా మూడు నెలల్లో మార్పులు వచ్చేస్తాయన్న వాదనను వినిపిస్తున్నారు.
కానీ.. ఇక్కడ వారంతా మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. ప్రజల్లో కేటీఆర్.. హరీశ్ ప్రసంగాలకు స్పందన ఎలా ఉందన్నది. అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించిన అహంభావం.. పవర్ పోయిన తర్వాత కూడా అలానే ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సభలో నోరెత్తటానికి విపక్ష నేతలకు అవకాశం ఇవ్వని వారు.. ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడేయటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.
‘‘వారు అలా మాట్లాడుతున్నారంటే కారణం.. ప్రతిపక్ష వాయిస్ కూడా ప్రజలకు తెలియాలన్న రేవంత్ ప్రభుత్వ చొరవే. ఒక మంచి అవకాశాన్ని తమ దూకుడుతనంతో చెడగొట్టుకోవటం బావ.. బావమరుదులకే చెల్లుతుంది’’ అన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూస్తే.. దూకుడుతో దూసుకెళ్లటం పది రోజుల అనుభవం కూడా లేని ప్రభుత్వం మీద వెళ్లటాన్ని ప్రజలు హర్షించరన్న వాస్తవాన్ని కేటీఆర్ అండ్ కో గుర్తిస్తే మంచిదంటున్నారు.