హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన బయో ఏషియా సదస్సు కీలక చర్చలకు వేదికైంది.. రెండో రోజున మంగళవారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ లు ఇరువురు ఇరవై నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఈ ప్రత్యక్ష సదస్సుకు సత్య నాదెళ్ల హాజరు కాలేదు. కానీ ఆన్ లైన్ లో సాగిన వీరి సంభాషణ ఆసక్తికరంగా మారింది.
అన్నింటికి మించి సత్యనాదెళ్లను మంత్రి కేటీఆర్ హాయ్ సత్యా అని పలుకరిస్తే.. మంత్రి కేటీఆర్ ను సత్యా నాదెళ్ల.. రామ్ అని పిలవటం ఆసక్తికరంగా మారింది. స్నేహపూర్వక వాతావరణంలో ఇరువురు ప్రముఖులు పలు అంశాల మీద మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా సత్యనాదెళ్లను కేటీఆర్ పలు ప్రశ్నలు వేశారు. అందుకు సత్యనాదెళ్ల సమాధానాలు ఇచ్చారు. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
– కరోనా మహమ్మారితో డిజిటల్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. క్లౌడ్.. టీమ్స్ వంటి సాంకేతికత లేకుంటే ఇలాంటి సమయంలో ఏం జరిగేదో ఊహించటానికే కష్టంగా ఉంది.
– కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడే వారికి సాంకేతికత ద్వారా సహకరిస్తున్నాం. తద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. సాంకేతికతో నాణ్యమైన ఔషధాల్ని తయారు చేయగలుగుతున్నాం. మొబైల్ యాప్ లో ఏఐ ట్రయాజ్ టూల్స్.. టెలీ మెడిసిన్ సౌకర్యం వచ్చిన తర్వాత అవుట్ పేషెంట్ విజిట్ ప్రక్రియ పూర్తిగా మారిపోయింది.
– రోగులు.. వారి బంధువుల సౌకర్యాలతో పాటు వైద్య నిపుణుల అవసరాలకు తగ్గట్లు కొత్త ఉపకరణాలను కనుగొన్నాం. వైద్యులకు మెరుగైన టెక్నాలజీ ఇవ్వటం వల్ల రోగ నివారణపై ఎక్కువ శ్రద్ధ పెట్టే అవకాశం కలిగింది. వైద్య రంగంలో వివిధ విభాగాల మధ్య అనుసంధానం జరగటం గొప్ప విషయం.
– కరోనా ప్రారంభంలో అడాప్టివ్ బయోటెక్ అనే కంపెనీతో పని చేశాం. ఆ కంపెనీ రోగనిరోధక వ్యవస్థ.. వైరస్ కు ఎలా రియాక్టు అవుతుందనే అంశంపై పరిశోధనలు చపట్టింది. అది అర్థం చేసుకుంటనే కరోనాకు సత్వరం ఔషధాలు.. టీకాలు కనుగునే వీలు కలుగుతుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుంది.
– కరోనా కాలంలో మనం ఇంటి నుంచే పని చేస్తున్నాం. అందరితోనూ సమన్వయంతో సులువుగా పని చేసుకోగలుగుతున్నాం. టెకీలే కాదు కరోనా పోరాట యోధులందరికి ఇది వర్తిస్తుంది. నిత్యం నేర్చుకునే స్వభాగం ఉంటేనే వ్యక్తి అయినా సంస్థ అయినా గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది.
– వర్క్ ఫ్రం హోం చేస్తున్నామా లేక స్లీపింగ్ ఫ్రం హోం చేస్తున్నామని అని నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది. అందుకే ఉద్యోగులకు సకాలంలో విరామం ఇవ్వాలి. వారి సంక్షేమం గురించి చూసుకునేందుక మేనేజర్లకు తగిన సౌకర్యాలు కల్పించాలి. సమన్వయం.. నేర్చుకోవటం.. శ్రేయస్సు అనే మూడు అంశాలు పని గురించి మన ఆలోచనలో మౌలిక మార్పులు తీసుకొస్తాయి.
– ఐదేళ్ల క్రితం మీతో (కేటీఆర్ ను ఉద్దేశించి) కలిసి టీ హబ్ ను సందర్శించాను. టెక్నాలజీ.. బయాలజీ రంగాలు సమన్వయంతో పని చేస్తే అద్భుత విజయాలు సాధిస్తాం. ఇలాంటి వాటిల్లో అంకుర సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్ కు చెందిన సైమెట్రిక్ అనే కంపెనీని ఈ మధ్యనే చూశా. అది క్లానికల్ ట్రయల్స్ ను అనూహ్య వేగంతో నిర్వహిస్తోంది. కొత్త విషయాల్ని ఆవిష్కరించటంతో క్లినికల్ ట్రయల్స్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
– వాయిస్ టెక్నాలజీ సహకారంతో వైద్య రంగంలో ఎన్నో అవరోధాల్ని అధిగమించగలుగుతున్నాం. ఉదాహరణకు వాయిస్ టెక్నాలజీ సహకారంతో అపోలో హాస్పటల్స్ 24 గంటల వైద్య సేవల్ని అందిస్తోంది. ఈ వాయిస్ టెక్నాలజీని అంకుర సంస్థలు అందించటం విశేషం. 99 డాట్స్ ప్రోగ్రాం ద్వారా క్షయ వ్యాధి చికిత్స కోసం ఫోన్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా వైద్యుల్ని సంప్రదించగులుగుతున్నాం. ఎవర్ వెల్ హెల్త్ సొల్యూషన్స్ అనే అంకుర సంస్థ దీన్ని నిర్వహిస్తోంది.