అయోధ్య రామమందిరం వ్యవహారంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ కార్యకర్తలు, నేతలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ధర్మారెడ్డి నివాసంపై దాడిచేసి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటన నేపథ్యంలో పరకాల పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ధర్మారెడ్డి నివాసంపై దాడిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే బీజేపీ నేతలు, కార్యకర్తలు బయట తిరగలేరని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న విషయం బీజేపీ గుర్తుంచుకోవాలని, పార్టీలోని ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకున్నాయని కేటీఆర్ అన్నారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్ కు ఉందని, బాధ్యతాయుతమైన పార్టీగా ఎంతో సంయమనం పాటిస్తున్నామని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు స్థానం లేదని, ప్రజలను మెప్పించడం రానివారే ఇతర పార్టీలపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.