రెండంటే రెండు విషయాలపై ఇప్పుడు పెను చర్చ ఒకటి జరుగుతోంది. ఒకటి సీఎం దావోస్ పర్యటనకు సంబంధించి, రెండు నిన్నటి వేళ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రుడితో భేటీ గురించి. ఇవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దావోస్ నుంచి ఆయనేం తెచ్చారు అన్నదానిపై ఇప్పటిదాకా ఎటువంటి క్లారిఫికేషన్ లేదని అమర్నాథ్ మాటలే అందుకు అద్దం పడుతున్నాయని విపక్షం సెటైర్లు వేస్తోంది.
ఇక ఢిల్లీ పర్యటనకు సంబంధించి అయితే మరో మాట వినిపిస్తుంది. ఇప్పటిదాకా వెళ్లిన ప్రతిసారీ లేదా అడిగిన ప్రతిసారీ సన్మానాల పేరిట కాలయాపన చేయడం తప్ప సీఎం ఏం సాధించారో చెప్పాలని , ఒక్కటంటే ఒక్క గెలుపు అయినా ఉందా అని ప్రశ్నిస్తోంది విపక్షం. తాజాగా విద్యుత్ బకాయిలకు సంబంధించి జగన్ తన గోడును ప్రధానికి వినిపించుకున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్న తెలంగాణకు ఆంధ్రా నుంచే భరోసా దక్కింది. ఇక్కడి నుంచే కరెంట్ సరఫరా అయింది. అంతేకాకుండా బకాయిల రూపంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఉన్న మొత్తం విలువ ఆరు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నా ఒక్కసారి కూడా ఇదే మాట కేసీఆర్ తో ప్రస్తావించిన దాఖలాలు లేవు. కానీ నిన్నటి వేళ ఇదే విషయాన్ని మోడీ దగ్గర ప్రస్తావించడమే విస్మయకర రీతిలో ఉంది.
వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది. కేటీఆర్ కూడా జగన్ ను పెద్దన్నగా భావిస్తున్నానని నిన్న కూడా చెప్పారు. అంటే కూర్చొని మాట్లాడుకుంటే తెగిపోయే విషయాలకు కూడా కేంద్రం జోక్యం అవసరం అని భావిస్తున్నారా ? లేకా కేసీఆర్ ను అడిగే ధైర్యం చేయలేకే ఈ విధంగా కేంద్రం ద్వారా సంప్రతింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారా ? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలే కోరుకుంటున్నామని కేటీఆర్ చెబుతున్న దృష్ట్యా ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి ఏపీ సర్కారు చొరవ చూపిస్తే మేలు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ పాటి దానికి మోడీ వరకూ వెళ్లాల్సిన పని కూడా లేదని, పవర్ ప్రాబ్లం విషయమై ఇరు వర్గాలు చర్చించుకుంటే పరిష్కారం కాని విషయం ఏమీ ఉండదని అంటున్నారు ఇంకొందరు పరిశీలకులు.