ట్విటర్ క్రేజ్ పెంచుకున్న కేటీఆర్‌కు ఇప్పుడు అదే ట్విటర్ వేదికగా వరుస కౌంటర్లు పడుతున్నాయి. కేటీఆర్ ఏదైనా ట్వీట్ చేయగానే బీజేపీ సోషల్ మీడియా వర్గాల నుంచి గతంలో కౌంటర్లు పడేవి. కానీ, ఇప్పుడు నేరుగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయే ట్విటర్లో కేటీర్తో కుస్తీకి దిగుతున్నారు. కేటీఆర్ ఏ తరహాలో ట్వీట్లు చేస్తున్నారో.. అదే ప్యాటర్న్‌లో ఆయనకు భారీ కౌంటర్ వేస్తున్నారు సంజయ్. మొన్నటికి మొన్న ఉగాది సందర్భంగా మోదీని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పంచాంగాన్ని ముడిపెడుతూ కేటీఆర్ ట్వీట్లు చేయగా బండి సంజయ్ కూడా అదే తీరులో కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనను లక్ష్యంగా చేసుకుని పంచాగానికి ముడిపెట్టి ట్వీట్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ట్విటర్లో ఇద్దరు నేతల మధ్య వార్ జరుగుతోంది. కేటీఆర్ ట్వీటుకు బండి సంజయ్ అదేస్థాయిలో కౌంటర్ ట్వీట్ చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారు.. అక్కడికి వారం రోజుల్లో మోదీ కూడా తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం: ప్రధాని,
పసుపు బోర్డు ఇవ్వం: ప్రధాని
మెట్రో రెండో ఫేజ్ ఇవ్వం: ప్రధాని
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వం: ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం: ప్రధాని
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వం: ప్రధాని
తెలంగాణకు ప్రధాని ప్రాధాన్యం ఇవ్వనప్పుడు ఆయనకు తెలంగాణ ప్రజలు ప్రాధాన్యం ఎందుకివ్వాలి.. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకు ఉండాలి’ అంటూ… తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదన్న ఉద్దేశంలో కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆయన ట్వీట్ చేసిన కొద్దిగంటల్లోనే బండి సంజయ్ కూడా అదే స్థాయిలో, అదే తీవ్రతతో ట్వీట్ చేశారు.
‘ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం: కేసీఆర్
దళితులకు మూడెకరాలు ఇవ్వం: కేసీఆర్
దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వం: కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలు భర్తీ చేయం: కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం: కేసీఆర్
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వం: కేసీఆర్
అర్హులకు దళితబంధు ఇవ్వం: కేసీఆర్’ అంటూ బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు.
ఈ ఇద్దరు నేతల ట్వీట్లను ఆయా పార్టీల శ్రేణులు పెద్దసంఖ్యలో రీట్వీట్లు చేస్తుండడంతో ట్విటర్ వేదికగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం ముదిరింది.
కాగా మొదటి నుంచి ట్విటర్లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌కు ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి ప్రతిఘటన ఉండేది కాదు. మొదట్లో ఆయన ట్విటర్ వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరిస్తుండేవారు. కానీ, కొద్దికాలంగా ఆయన ట్విటర్‌ను రాజకీయ విమర్శలకే పూర్తిగా వాడుతున్నారు. అప్పటి నుంచే ఆయనకు ట్విటర్లో బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.