నువ్వు ఒకటి అంటే నేను నాలుగు అంటా.. అన్నట్లుగా మారింది ఇప్పటి రాజకీయం. మర్యాద.. గౌరవం లాంటి వాటిని వదిలేసి చాలా కాలమే అయిపోయింది. కాస్తంత ఎటకారంగా ఒక పోస్టు పెడితే.. దానికి రెట్టింపు ఎట‘కారం’ రంగరించి చిమ్ముతున్న కాలమిది. ఈ విషయాన్ని గుర్తించి ఆచితూచి అడుగులు వేయాల్సిన మంత్రి కేటీఆర్.. అందుకు భిన్నంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
తాను అన్నంతనే అయిపోదు. అవతలోడు కూడా అంతగానే స్పందిస్తాడు. కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. కదిలించి తిట్టించుకునే మంత్రి కేటీఆర్ తీరు ఇప్పుడు చర్చగా మారింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ.. అనునిత్యం ఏదో ఒక కొత్త రీతిలో ట్వీట్లతోనో.. ప్రకటనలతోనో విరుచుకుపడుతున్నారు మంత్రి కేటీఆర్. అందుకు ధీటుగా సమాధానం ఇచ్చే విషయంలో కమలనాథులు వెనుకబడే ఉన్నారని చెప్పాలి. దీంతో.. రెట్టించిన ఉత్సాహంతో వరుస పెట్టి విమర్శలు చేస్తున్న ఆయనకు ఉగాది రోజున కేటీఆర్ చెప్పిన పంచాంగం ట్వీట్ ఆసక్తికరంగా మారటమే కాదు.. పలువురిని ఆకర్షించింది. ఆయన పోస్టు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇంతకూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఏమిటన్నది చూస్తే..
ఆదాయం: ఆదానీకి
వ్యయం: జనానికి.. బ్యాంకులకు
అవమానం: నెహ్రూకి
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి.
బస్.. బభ్రాజీమానం భజగోవిందం.. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!
అంటూ పంచ్ ల మీద పంచ్ ల్ని రంగరించి తన ఉగాది పంచాంగం ట్వీట్ ను చేశాడు. వావ్.. మోడీని భలేగా ఏసుకున్నారే మంత్రి కేటీఆర్ అని అనుకున్నంతలోనే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు దీనికి కౌంటర్ గా ఒక ట్వీట్ ను సంధించారు. అందులో కేటీఆర్ అండ్ కోకు నోట మాట రాని రీతిలో పంచ్ లు దట్టించారు.
బండి సంజయ్ పంచాంగం ట్వీట్ ను చూస్తే..
ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి
అవమానం: ఉద్యమ వీరులకు, అమరవీరుల త్యాగాలకు
రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు.. దొంగలకు.
తుస్.. పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తురువాయి. పతనం ఇక షురువాయే! అంటూ విరుచుకుపడేలాంటి ట్వీట్ ను సంధించారు. ఇదంతా చూసినప్పుడు మంత్రి కేటీఆర్ సంధించే ట్వీట్లకు నిమిషాల వ్యవధిలోనే అంతకుమించిన ట్వీట్లు రెఢీ చేసే సత్తా ఉన్నోళ్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమకూర్చుకున్నారన్న విషయం అర్థమవుతుంది.
ఈ వ్యవహారంలో ట్విస్టు ఏమంటే.. తన పంచాంగం ట్వీట్ తో ప్రధానమంత్రి మోడీని కెలికిన మంత్రి కేటీఆర్ కు అంతకు మించి మంట పుట్టేలా ఉన్న ఈ ట్వీట్ ను బండి సంజయ్ టీం సంధించిన తర్వాత కేటీఆర్ సోషల్ విభాగం కామ్ అయ్యింది. ఇదంతా చూసినప్పుడు.. దఒక మాట అనటం ఎందుకు? నాలుగు మాటలు అనిపించుకోవటం ఎందుకు? అన్నది చర్చగా మారింది.
అంతేకాదు.. జాతీయ రాజకీయాలు అన్న పేరుతోతన తండ్రి రాజకీయం మొదలుపెట్టిన వేళ.. గుజరాత్ ‘గుంపు’ లాంటి మాటలతో మరింత డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు మిస్ అయినట్లు? టార్గెట్ చేయాల్సిన వారిని చేయటం ఆపేసి.. మందిని విషయంలోకి తీసుకురావటం ద్వారా.. వ్యతిరేకుల సంఖ్యను పెంచుకుంటున్నామన్న సోయి యువరాజా వారిలో మిస్ కావటం ఏమిటి?