కేటీఆర్ చేసిన పని ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. తాజాగా ఖమ్మం జిల్లా టేకులపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సందర్భంగా ఒక ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్.. అక్కడి వంటింట్లో ఉన్న ట్యాప్ ను తిప్పి.. మిషన్ భగీరథ నీటిని దోసిట్లో పట్టుకొని తాగిన వైనం పలువురిని ఆకర్షించింది. ఇప్పుడున్న కరోనా టైంలో బయట తిండి.. బయట నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు సామాన్యుడే ఆలోచిస్తున్న పరిస్థితి.
అలాంటిది వీవీఐపీగా ఉన్న మంత్రి కేటీఆర్ మాత్రం.. అలాంటివేమీ ఆలోచనలు లేకుండా.. ఇంటిని పరిశీలించే క్రమంలో నల్లా నీళ్లను తాగేసిన వైనం ఆశ్చర్యకరంగా మారింది. ఏమైనా..దీనికి కొంచెం ధైర్యం కావాల్సిందే. సరే ఆయన ఈ పని ఎందుకు చేశారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. మిషన్ భగీరథ నీటి పథకం ఈ మధ్య వార్తల్లో లేదు.
టీఆర్ ఎస్ సర్కారు అది చరిత్రలో ఒక సువర్ణాాక్షరాలతో లిఖించదగ్గ పనిగా చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు మిషన్ భగీరథను మరోసారి వార్తల్లోకి తేవడానికి కేటీఆర్ చసిన ఆలోచన అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇలాంటి ఫొటోలు కార్యకర్తలకు కూడా కిక్కిస్తాయి.