బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సభ్యులు విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసింది. దీంతో, ఆ శ్వేత పత్రానికి దీటుగా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేసింది. తాజాగా, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రం విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
ఆ పత్రం తప్పులతడకని, తెలంగాణ అప్పు 3.17 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ బురద జల్లుతోందని అన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై కేటీఆర్ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో కూడా తెలంగాణను కాంగ్రెస్ నేతలు నాశనం చేశారన్నారు. అప్పులను లెక్క కడుతున్న కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పేదరికం తగ్గి తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఇకనైనా తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రించే ప్రయత్నం మానుకోవాలన్నారు.