సుగుణాల కుప్పగా తన గురించి తాను చెప్పుకోకుండానే కీర్తిని సొంతం చేసుకున్న మేధావి ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. పట్టించుకోకుండా.. అలాంటివేమీ జరగటం లేదన్న భావనను కలిగించటం మోడీ సర్కారుకే సాధ్యమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బ తీసేందుకు అవసరమైన నిర్ణయాల్ని ఒకటి తర్వాత ఒకటిగా బయటకు తీస్తున్నారన్న సందేహం ఇటీవల కాలంలో ఎక్కువ అవుతోంది.
దీనికి తగ్గట్లే.. మోడీ పరివారంపై పంచ్ ల మీద పంచ్ లు వేసే సదవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అస్సలు మిస్ కావటం లేదు. ఆ మాటకు వస్తే.. ఏపీ నేతల కంటే మిన్నగా ఆయన స్పందిస్తున్నారు. దీనికి తోడు తాజాగా వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేటీఆర్ విమర్శలకు మరింత పదునుచేకూరుస్తున్నాయి. తమ పాలనపై పదే పదే ప్రశ్నలు సంధిస్తూ ఇరిటేట్ చేస్తున్న కమలనాథులకు కరెంట్ షాక్ కొట్టేలా విశాఖ ఉక్కు అంశాన్ని ఆయన తరచూ ప్రస్తావిస్తున్నారు. అవసరమైతే విశాఖకు వెళతామని.. మద్దతు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. విశాఖ ఉక్కుకోసం పోరాడుతున్న వారికి కొత్త బలాన్ని తీసుకొచ్చాయి.
తన వ్యాఖ్యలకు వచ్చిన సానుకూల స్పందనను కేటీఆర్ సైతం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే.. కీలకమైన ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఆయన.. తానుపాల్గొన్న కార్యక్రమంలో మోడీ అండ్ కోపై విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో తమ వైఫల్యాల్ని అదే పనిగా ప్రశ్నిస్తున్న తెలంగాణ బీజేపీ నేతల నోటికి తాళాలు వేసేలా ఆయన విశాఖ స్టీల్ గురించి అదే పనిగా ప్రస్తావిస్తూ.. వారి దుకుడుకు కళ్లాలు వేస్తున్నారు.
తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం.. దాన్ని ప్రైవేటీకరించేపనిలో బిజీగా ఉన్న కేంద్రంపై ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా తెలంగాణ దేశంలో భాగం కాదా? అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఆయనేం మాట్లాడారు? అన్న విషయంలోకి వెళితే..
– ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు అమ్ముతున్నరని అడిగితే విశాఖలో మీకేం పని అంటరా? ఏం విశాఖ భారత్‌లో లేదా.. మేం భారతీయులం కాదా? మాట్లాడొద్దా? బీజేపీకి ఓటేస్తే ప్రైవేటీకరణకు మద్దతిచ్చినట్టేనని, ధరల పెరుగుదలను ప్రోత్సహించినట్టే.
– పెద్ద ఎన్నికలైతే సరిహద్దులో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడం.. చిన్న ఎన్నికలైతే భైంసా అల్లర్లను సృష్టించడమే బీజేపీ ఎజెండా. బయ్యారం దేవుడెరుగు. ఇప్పుడు విశాఖ ఉక్కుఫ్యాక్టరీని అమ్ముతున్నరు. ఎందుకు అమ్ముతున్నరంటే విశాఖల నీకేం పని అంటరు. విశాఖ దేశంలో లేదా.. మాట్లాడొద్దా? ఈ దేశంలో మాకు హిస్సా లేదా? ఇయ్యాల నువ్వు అక్కడ అమ్ముతున్నవు. రేపు మా సింగరేణి మీద పడతరు. ఈసీఐఎల్ మీద పడతరు. ఇవాళ ఇతరులకు కష్టం వచ్చిందని మనం ఊరుకుంటే రేపు మనం కూడా ఇబ్బంది పడతం.
– ఎవరికి కష్టమొచ్చినా అందరం కలిసికట్టుగా ఉండాలి. మనమంతా ముందు భారతీయులం అని, తర్వాతే తెలంగాణ పౌరులం. దేశంలో ఎక్కడ తప్పుజరిగినా నిలదీయాలి. కేంద్రప్రభుత్వం వంద ప్రభుత్వరంగ సంస్థలను ఎలా అమ్మాలని ఆలోచిస్తున్నది?
– మేము అమ్ముతున్నాం.. మీరు కూడా అమ్మండి’ అంటూ కేంద్రం సిగ్గులేకుండా రాష్ర్టాలకు సూచిస్తున్నది. ఐడీపీఎల్‌ను ఖతం పట్టించారు. ఇప్పుడు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను కొనుక్కోండంటూ రాష్ర్టానికే సలహాలిస్తున్నదన్నారు. మా భూములను మీరు అమ్ముడేంది?
– తెలంగాణ జాతి జాతి కాదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? జాతీయవాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా? కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొం డిచేయి చూపుతున్నది. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో తెలంగాణకు ఒక్కటంటే ఒక్కసంస్థను ఇవ్వలేదు.