తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్, బీజేపీ నేతలు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి, బల్దియా ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీనివ్వడంతో టీఆర్ఎస్ నేతలపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అయితే, హాలియాలో జరిగిన బహిరంగ సభలో సహనాన్ని పరీక్షిస్తే కాంగ్రెస్, బీజేపీ నేతలను తొక్కిపడేస్తామంటూ కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్….తనదైన శైలిలో విమర్శలు గుప్పించారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ఓపికను పరీక్షించొద్దని, హద్దు దాటితే ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి సీఎంలను సైతం ఉరికించామని, బీజేపీ, కాంగ్రెస్‌ల బతుకెంత అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు సీఎం కేసీఆర్‌పై మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.
రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుందని, తమ ఓపికను, సహనాన్ని అసమర్థతగా భావించొద్దని కేటీఆర్ హెచ్చరించారు. 20 ఏళ్లలో గెలుపోటములను చాలా చూశామని, ఎన్ని అడ్డంకులొచ్చినా ఎత్తిన జెండా దించకుండా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఆనాడు గంజిలో ఈగల్లాగా ఆంధ్రా నాయకులు తీసిపారేశారని, ఆనాడు వారి బతుకులేందో గుర్తు తెచ్చుకోవాలని దుయ్యబట్టారు.
రాయలసీమ నాయకుల ముందు చేతులు కట్టుకుని నిల్చున్న బతుకులు నాటి కాంగ్రెస్, బీజేపీ నేతలవని, తెలంగాణ కోసం ఒక్కడూ రాజీనామా చేయలేదని విమర్శించారు. తెలుగు గడ్డమీద పుట్టిన ప్రాంతీయ పార్టీలు టీడీపీ, టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఆనాడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి 3 దిగ్గజ పార్టీలను ఎదిరించి కేసీఆర్ నిలబడ్డారని గుర్తు చేశారు.