కొద్ది రోజులుగా మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన తనయులు, బంధువుల ఇళ్లు,కార్యాలయాల్లో ఐటీ, ఈడీ సోదాల వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన మెడికల్ కాలేజీలో జరిగిన ఓరియెంటేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కష్టపడి విద్యార్ధులు చదువుకోవాలని, భూమి అమ్మి తన కుమారుడిని డాక్టర్‌ను చేస్తే.. తనకు డాక్టర్ కోడలు గిఫ్ట్‌గా వచ్చిందని మల్లారెడ్డి చెప్పారు. తన కోడలిని పొగిడే క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అదే రెడ్డి అమ్మాయితో తన కొడుకుకి పెళ్లి చేసి ఉంటే కిట్టీ పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేదని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో, మల్లారెడ్డి ఆ కామెంట్లపై క్షమాపణలు తెలిపారు. తాను కావాలని అలా మాట్లాడలేదని, ఫ్లోలో అలా వచ్చిందని, తన మాటలు ఎవరినైనా కించపరిచినట్లు ఉంటే క్షమించాలని మల్లారెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మల్లారెడ్డిపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మల్లారెడ్డి మైక్ పట్టుకుంటే తనకు భయమైతందని, ఆయన ఏం మాట్లాడతడోనని టెన్షన్ గా ఉందని కేటీఆర్ సెటైర్ వేశారు. ఎల్బీనగర్లో దాదాపు రూ.55 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మరోసారి సీఏం అయ్యేది కేసీఆరేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నాగోల్, ఎల్బీ నగర్ వరకు మెట్రో పూర్తయ్యిందని, నాగోల్ నుంచి ఎల్బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్‌లో కలిపే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
అంతేకాదు, రాబోయే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని, ఆ దిశగా ప్రజారవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. టిమ్స్ ఆసుపత్రి గడ్డి అన్నారంలో రాబోతుందని కేటీఆర్ చెప్పారు.