టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. డ్రగ్స్ వాడేవారికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు రేపాయి. రాహుల్ గాంధీ నార్కోటిక్ పరీక్షలు చేయించుకుంటే తాను కూడా ఆ టెస్ట్ కు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు.
యువతకు డ్రగ్స్ పర్యవసానాలపై అవగాహన కలిగించేందుకు తాను, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి వైట్ ఛాలెంజ్ ను ప్రారంభించామని, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేటీఆర్ కోసం వేచి చూస్తుంటామని రేవంత్ అన్నారు. ఢిల్లీలో ఎయిమ్స్ లో టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమని కేటీఆర్ స్పందించారు. అయితే, ఆ టెస్టులకు రాహుల్ గాంధీ రావాలని సవాల్ విసిరారు. చర్లపల్లి జైల్లో జైలు జీవితం గడిపిన వ్యక్తుల నుంచి సవాల్ స్వీకరించడం తన స్థాయికంటే తక్కువని కేటీఆర్ అన్నారు.
ఒకవేళ నార్కోటిక్ పరీక్షల్లో తనకు క్లీన్ చిట్ వస్తే… బేషరతుగా క్షమాపణలు చెప్పి, పదవులకు రాజీనామా చేస్తారా? అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమా? అని చాలెంజ్ చేశారు. అయితే, లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని… సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కుంభకోణాల్లో సీబీఐ కేసుల విషయంలో కేసీఆర్ కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. టైమ్, ప్లేస్ చెప్పాలంటూ చాలెంజ్ చేశారు.
ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈరోజు తాను చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానని… కోర్టులో పరువునష్టం దావా వేశానని కేటీఆర్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని… అబద్ధాలను కోర్టు రుజువు చేస్తుందని, అపరాధులు తగిన విధంగా బుక్ అవుతారని అన్నారు. రేవంత్ పేరును ప్రస్తావించకుండా కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.