ఏపీ సీఎం జగన్ పాలన అధ్వానంగా ఉందని టీడీపీ సహా విపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని, సంక్షేమ పథకాలు అంటూ అభివృద్ధిని పాతాళానికి నెట్టేశారని ఆర్థిక నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఇక, జగన్ అప్పుల పాలనపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా పలుమార్లు పెదవి విరుస్తున్నారు. కేవలం ప్రత్యర్థి పార్టీపై కక్ష సాధించడానికి అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన జగన్….మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
జగన్ హయాంలో నిత్యావసర సరుకులు మొదలు అన్ని రేట్లు పెరిగిపోయాయని, పన్నుల రూపంలో జగన్ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్ పాలన అద్భుతంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. ఆంధ్రాలో మా అన్న జగన్ మంచి పాలన సాగిస్తున్నారని కేటీఆర్ కితాబిచ్చారు, కరోనా సంక్షోభాన్ని జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు.
ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను కూడా జగన్ అమలు చేశారని కేటీఆర్ కొనియాడారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఏపీకి ఆర్ఖిక కష్టాలు వచ్చాయన్న వాదనను కేటీఆర్ కొట్టిపారేశారు. అవన్నీ రాజకీయంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలే తప్ప నిజం లేదని అన్నారు. నిజానికి ఏపీ ఖజానా.. యూపీ ఖజానా కంటే పటిష్టంగా ఉందని కేటీఆర్ అన్నారు.
ఇక, ఏపీలో జగన్ పాలనను యూపీలో యోగి పాలనతో కేటీఆర్ పోల్చడం వెనుక జాతీయ రాజకీయాలున్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్…జగన్ తో యోగికి పోలిక పెట్టారని చెబుతున్నారు.