తెలంగాణతో పాటు ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. అయితే, హైదరాబాద్ తో పాటు వరంగల్…ఏపీలోని భీమవరం, నెల్లూరు వంటి ప్రాంతాలలో కూడా ఐటీ కంపెనీలు రావాలని ఆయన అన్నారు. బెంగళూరులో 40 శాతం మంది ఏపీ, తెలంగాణ వారేనని, వారి ప్రాంతాలకే ఐటీ కంపెనీలు వస్తే వారంతా తమ సొంత ఊళ్లకు వచ్చి పనిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాంపూర్ లో ఐటీ కంపెనీ ప్రారంభోత్సవానికి వెళ్లిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని భీమవరం, నెల్లూరులో ఐటీ కంపెనీలు పెట్టాలని…కావాలంటే జగనన్నకు చెప్పి స్థలం ఇప్పిస్తానని ఐటీ కంపెనీ యజమానులతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఏపీలో పరిస్థితులు బాగుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలే ముందుకు వచ్చేవని, జగన్ దెబ్బకు భయపడుతున్నారు కాబట్టే కేటీఆర్ సిఫారసు చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జగన్ అసమర్థ పాలన వల్లే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పొరుగు రాష్ట్రం నేతలు రికమండేషన్ చేయాల్సి వస్తోందని ట్రోల్ చేస్తున్నారు. ఇలా మాట్లాడి జగన్ పరువు కేటీఆర్ తీశారని ట్రోల్ చేస్తున్నారు.