మంత్రిగా పదేళ్ల అనుభవం.. రాజకీయ నాయకుడిగా 15 ఏళ్ల అనుభవం(మంత్రి అనుభవాన్ని కలుపుకొని). మరి ఎలా వ్యవహ రించాలి? ఎంత ఆదర్శంగా ఉండాలి? కానీ, ఇవేవీ మరిచిపోయినట్టుగా ఉన్నారు చిన్నసారు.. కేటీఆర్! బుధవారం అసెంబ్లీలో జరిగిన ఒక చిన్న ఘటన.. అది కూడా పెద్ద వివాదమేమీ కాదు.. దీనిని అడ్డు పెట్టుకుని ఏదో స్వాతంత్ర్యోద్యమ పిలుపు మాదిరి గా కేటీఆర్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల ను దహనం చేయాలని కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు.
ఇది తగునా?
నిజానికి బుధవారం సభలో జరిగిందానికి అక్కడితో సీఎం రేవంత్‌రెడ్డికూడా సమాధానం చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి మోసం చేశారని.. ఆమెను నమ్ముకోవద్దన్నారు. అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి కూడా తమను మోసం చేశారని.. వ్యాఖ్యానించారు. దీనికి సబిత తీవ్రస్తాయిలో కన్నీరు పెట్టుకోవడం.. సభలో అలజడి రేపడం.. సభను వాయిదా వేయడం.. మాటల తూటాలు, వ్యాఖ్యల యుద్ధాలు కామన్‌గా మారాయి. దీంతో ఇరు పక్షాల మధ్య కూడా.. పరిస్థితి దారి తప్పి.. స్పీకర్ సభను వాయిదా వేశారు. తర్వాత.. మళ్లీ కూడా ఇదే విషయంపై జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
సబితక్క, సునీతక్కల పట్ల తనకు గౌరవం ఉందన్నారు. కానీ, గతంలో తనను కాంగ్రెస్ పార్టీలోకి పిలిచి.. సబితక్క బీఆర్ ఎస్‌లోకి చేరిపోయారని.. సునీతా లక్ష్మారెడ్డి తనపై కేసు నమోదైతే.. కనీసం బీఆర్ ఎస్‌లోకి వెళ్లాక తీసేసే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. ఈ వ్యాఖ్యల్లో సునీతా లక్ష్మారెడ్డి బాగానే ఉన్నా.. సబిత మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు. సభలో కొంత గందరగోళం లేచింది. ఇక, దీనిని కోట్ చేస్తూ.. కేటీఆర్ ఇంటా బయటా కూడా..రేవంత్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఇది సబితక్క, సునీతక్కలకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. యావత్ తెలంగాణ మహిళా సమాజానికి జరిగిన అవమాన మని అభివర్ణించారు. కాబట్టి రేవంత్ చర్యలను ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సీఎం రేవంత్ దిష్టి బొమ్మలు తగుల బెట్టాలని పిలుపునిచ్చారు. కానీ, దీనిపై మేధావుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పదేళ్ల మంత్రిగా అనుభవం, 15 ఏళ్ల రాజకీయ నాయకుడిగా అనుభవం నేర్పింది ఇదేనా? అని మండిపడుతున్నారు. సభలో జరిగిన దానిని సభలోనే తేల్చుకునే అవకాశం ఉందని.. కానీ, దీనిని ప్రజాసమస్యగా ముడిపెట్టి.. ఇంకే సమస్యలు లేవన్నట్టుగా దిష్టి బొమ్మలు తగలబెట్టుడు ఏంటని నిలదీస్తున్నారు. గతంలో కేసీఆర్ దిష్టి బొమ్మ తగుల బెట్టినప్పుడు.. కేటీఆర్ ఏమన్నారో గుర్తులేదా? అంటూ.. నిలదీస్తున్నారు.