జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత, ఆరోగ్య స్థితిపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణిలు ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డీ హైడ్రేషన్, స్కిన్ ఎలర్జీతో అనారోగ్యం పాలయ్యారని, జైల్లోని కలుషిత నీరు, అపరిశుభ్ర వాతావరణంతో ఆయన ఆరోగ్యం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర చేస్తున్నారని, ఆయనకు ఏమైనా జగన్ దే బాధ్యత అని లోకేష్ అన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై, లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని కేటీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యం బాగోలేకుంటే కొడుకు పడే ఆందోళన ఏమిటో తనకు తెలుసని, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేసేటపుడు తాను కూడా ఆందోళన చెందానని అన్నారు. హైదరాబాద్, ఐటీ కారిడార్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దని చెబుతున్నానని కేటీఆర్ అన్నారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్ ఇలా యూటర్న్ తీసుకొని చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.