ఏపీ, తెలంగాణల మధ్య జల జగడం ముదిరి పాకాన పడుతోన్న సంగతి తెలిసిందే. జలవివాదం నేపథ్యంలో ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ పై తెలంగాణ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జలాల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి హక్కు కోసం ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని షాకింగ్ కామెంట్లు చేశారు.
కృష్ణా జలాలపై ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడబోమని, చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని వెల్లడించారు. రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేవని కేటీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని, తెలంగాణలో మరిన్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామని కేటీఆర్ అన్నారు.
నారాయణపేటకు జలాలు రావాలంటే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికోసం ఎవరితోనైనా పోరాడతామని కేటీఆర్ అన్నారు. మరి, కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సర్కార్ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.