తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాట..రెండు తెలుగు రాష్ట్రాల అధికార పక్షాల మధ్య అగ్గి రాజుకునేలా చేసింది. సహజ మిత్రుల మాదిరి వ్యవహరిస్తూ.. తమ అవసరానికి మాత్రం ఏపీని ఏసుకునే అలవాటున్న సీఎం కేసీఆర్ వ్యూహానికి భిన్నంగా మంత్రి కేటీఆర్ మాటలు ఉన్నాయని చెప్పాలి.
పక్క రాష్ట్రంలో కరెంటు.. నీళ్లు.. రోడ్లు ఏమీ లేవని.. ఆ విషయాన్ని సంక్రాంతికి వెళ్లిన సందర్భంగా ఆ రాష్ట్ర పరిస్థితిని తన స్నేహితుడు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత చెప్పినట్లుగా పేర్కొన్నారు. కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటకు ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలు పలువురు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయటం.. అందుకు బదులుగా తెలంగాణ అధికార పక్షానికి చెందిన నేతలు సైతం రియాక్టు కావటం.. పంచ్ ల మీద పంచ్ లు ఇచ్చే ప్రోగ్రాంకు తెర తీశారు.
చూస్తుండగానే రెండు తెలుగు రాష్ట్రాల అధికారపక్షాల మధ్య మొదలైన వేడి.. సోషల్ మీడియాకు పాకి.. ఎవరికి వారు తమ వాదనలు వినిపించేస్తూ వేడిని మరింత పెంచేశారు. ఇక.. మరికొందరు కేటీఆర్ మాటలకు విశ్లేషణలు రాసేసి.. ఏపీ సర్కారును దెబ్బ తీసేందుకు కేటీఆర్ కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టారని.. తెలంగాణలోని వైఎస్ వ్యతిరేకుల్ని తమ వైపునకు ఆకర్షించేలా చేస్తున్నారంటూ.. తమదైన విశ్లేషణలు వండి వార్చేశారు.
ఇదిలా ఉండగా.. శుక్రవారం అర్థరాత్రి వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యథాలాపంగా (కేటీఆర్ వెర్షన్ లో) తాను అన్న మాటలకు ఇంత భారీగా చర్చ జరగటం.. రెండుతెలుగు రాష్ట్రాల మధ్య వేడిని పుట్టించేసిన నేపథ్యంలో.. దీనంతటికి కారణమైన మంత్రి కేటీఆర్ ఒక అడుగు వెనక్కి వేస్తూ ట్వీట్ చేశారు. తానీ రోజు ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు బాధ కలిగించినట్టుందన్నారు.
‘ఏపీ సీఎం వైఎస్ జగన్ గారితో నేను సోదర సమాన అనుబంధాన్ని అస్వాదిస్తా. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పురోగమించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇష్యూను తేలిక పరిచే ప్రయత్నం చేశారు. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఏపీ అధికారపక్ష నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.