ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మంత్రులు ఘాటుగా స్పందించారు. కేటీఆర్.. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి గురించి తన స్నేహితుడు చెప్పింది విని కేటీఆర్ చెప్పారన్న బొత్స… తాను హైదరాబాద్ వెళ్లి ఉండి వస్తున్నానని అన్నారు. హైదరాబాద్‌లో అసలు కరెంటే ఉండటం లేదని చెప్పారు. రోజుల తరబడి జనరేటర్ పెట్టుకున్నానని అన్నారు. తన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం సరైంది కాదని అని హితవు పలికారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రహదారులు, నీళ్లు, కరెంటుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాను హైదరాబాద్‌లోనే ఉండి వస్తున్నానని.. అక్కడ కరెంటు లేదని.. తాను అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చింద న్నారు. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బొత్స హితవు పలికారు.
‘‘కేటీఆర్ చెప్పినట్టయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా? ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు… నేను హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా. అక్కడ కరెంటే లేదు. నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు. అంతేగానీ ఇలా అంటారా? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడోచ్చా? ఆయన తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలి’’ అని బొత్స పేర్కొన్నారు.
“ఏపీలో కరెంట్, నీళ్లు లేవని కేటీఆర్‌కు తన ఫ్రెండ్ చెప్పారన్నారు. ఆయన చూడలేదు. నేను స్వయంగా హైదరాబాద్ నుంచే వస్తున్నా. అక్కడసలు కరెంటే లేదు. దానికి ఏం సమాధానం చెప్తారు. జనరేటర్ వినియోగించాం. బాధ్యత కలిగిన వ్యక్తిగా అలా మాట్లాడటం సరికాదు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.“ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయాల కోసమే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రైతులకు ఏడు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. ఎక్కడైనా సాంకేతిక సమస్యతో పావుగంట మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
కాగా.. శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్, మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో కరెంట్, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారన్నారు.
అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు. దీనిపై క్షణాల వ్యవధిలోనే స్పందించిన మంత్రి జోగి రమేష్.. కేటీఆర్.. పిట్ట కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. తర్వాత వరుసగా మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు.