తెలంగాణ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీఆర్ ఎస్ పార్టీ.. ఏ వర్గాన్నీ వదిలి పెట్టడం లేదనే విషయం తెలిసిందే. అన్ని వర్గాలనూ చేరువ చేసుకుంటోంది. పార్టీ చేరువ అవుతోంది. రైతులు(రుణమాఫీ-రైతుబంధు), మహిళలు(ఆసరా రుణాలు,ఇతర పథకాలు), వృద్ధులు(పింఛన్ల పెంపు), విద్యార్థు లు(నియామకాలు, నోటిఫికేషన్లు), సెటిలర్లు(స్వేచ్ఛాయుత వాతావరణం).. ఇలా అన్ని వర్గాలను వివిధ పథకాలతో ఆకట్టుకుం టున్న విషయం తెలిసిందే. అయితే.. వీరిలో మధ్య తరగతి వర్గాన్ని బీఆర్ ఎస్ పార్టీ ఎక్కడో మరిచిపోయింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి చాలా రోజులే అయినా.. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నా.. మధ్యతరగతి ప్రజలు, వారి ఓట్ల విషయాన్ని మరిచిపోయారు.
ఇక, తాజాగా ఈ విషయాన్ని గుర్తించిన మంత్రి, పార్టీ ఫైర్ బ్రాండ్ కేటీఆర్.. వెంటనే వారిపై వరాల జల్లు కురిపించేప్రయత్నం చేశారు. మధ్యతరగతి ప్రజల గురించి.. సీఎం కేసీఆర్ ఎన్నో కలలు కంటున్నారని.. మధ్యతరగతి కోరుకునే ఇంటి కలను నిజం చేసేందుకు.. ఆయన ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కొత్తగా ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా హెచ్ఐసీసీలో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో కొవిడ్, ఎన్నికల వల్ల ఆరున్నరేళ్లు మాత్రమే నికరంగా పరిపాలించామని చెప్పారు. అయినప్పటికీ.. అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. మధ్యతరగతి వర్గాన్ని తాము విస్మరించలేదని.. వారి విషయాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారని, ప్రభుత్వం రాగానే మధ్యతరగతి ప్రజలు కలలు కనే.. ఇంటి నిర్మాణాలకు సంబంధించి కేసీఆర్ చక్కని పథకాన్ని ప్రకటించనున్నారని కేటీఆర్ చెప్పారు.
మధ్యతరగతి ప్రజలు తమకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే.. కొసమెరుపు ఏంటంటే.. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ..ఇప్పటి వరకు ఎలాంటి పథకాన్నీ.. మధ్యతరగతి వర్గానికి ప్రత్యేకంగా ప్రకటించింది లేదు. అంటే ఒకరకంగా వారిని మరిచిపోయారు. కానీ, హఠాత్తుగా ఈవిషయం గుర్తుకు రాగానే.. కేటీఆర్ ఇలా ప్రకటన చేయడం గమనార్హం. మరి దీనికి ఎంత మంది మధ్యతరగతి ప్రజలు ఫిదా అవుతారో చూడలి.