క్యూన్యూస్ అధినేత, బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన మల్లన్న…ఆ పై బెయిల్ మీద బయటకు వచ్చి బీజేపీలో చేరారు. దీంతో, ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో తాజాగా మల్లన్న మరో వివాదంలో చిక్కుకున్నారు.
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును బాడీ షేమింగ్ చేస్తూ మల్లన్న ట్విటర్ లో ఒపీనియన్ పోల్ నిర్వహించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగడం ఏమిటంటూ కేటీఆర్ మండిపడ్డారు.
‘అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..?’ అంటూ తీన్మార్ మల్లన్న ట్విట్టర్లో ఒపీనియన్ పోల్ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వెళ్లి ఆయనపై దాడి చేశారు. అయితే, తన ట్విటర్ ఖాతా హ్యాక్ అయిందని మల్లన్న చెబుతున్నారు. కానీ, ఆ విషయం నమ్మశక్యంగా లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఈ ఘటనపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. భావవ్యక్తీకరణ పేరుతో ఇతరులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం సరికాదన్నారు. తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. జర్నలిజం ముసుగులో అర్థం పర్థం లేని విషయాలు బయట పెట్టే చెత్త యూట్యూబ్ చానల్స్.. రాజకీయాల్లోకి పిల్లలను లాగడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఇలాగే మోదీ, అమిత్ షా కుటుంబాలను లాగితే ఊరుకుంటారా? అని నడ్డాకు చేసిన ట్వీట్లో మంత్రి ప్రశ్నించారు.