మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బావ , బావమరుదులు అంటే హరీష్ రావు, కేటీయార్ కు బుద్ధి వచ్చినట్లు లేదు. అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చినట్లు బావ, బావ మరిది అక్కసు వెళ్ళగక్కుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను వందరోజుల్లో అమల్లోకి తేకపోతే పోరాటాలు చేయాలని వీళ్ళు పిలుపిచ్చారు. కేసీయార్ హయాంలో అమలుచేసిన పథకాలను ఇపుడు కంటిన్యు చేయాల్సిందే అని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.
తమ హయాంలో అమలైన పథకాలను కంటిన్యు చేయకపోతే కోర్టుల్లో కేసులు వేస్తామని బెదిరించారు. కేసీయార్ హయాంలో అమలైన పథకాలను కంటిన్యు చేయాలా ? వద్దాన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం. అంతేకానీ కచ్చితంగా అమలుచేయాలని రూలేమీలేదు. ప్రకటించిన పథకాలను కేసీయారే సక్రమంగా అమలుచేయనపుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు అమలుచేస్తుంది ? దళితబంధు, గృహలక్ష్మి పథకాలను అమలుచేయాల్సిందే అని హరీష్ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. పై రెండు పథకాలను కేసీయారే సరిగా అమలుచేయలేదని అందరికీ తెలుసు.
ఇక కాళేశ్వరంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని కేటీయార్ చాలెంజ్ చేయటం ఆశ్చర్యంగానే ఉంది. రు. 50 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు చెప్పటం పెద్ద జోక్ గా తయారైంది. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని జరిగిందని ప్రభుత్వం అంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని కేటీయార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించిన విషయం ఇప్పటికే బయటపడింది. మేడిగడ్డ బ్యారేజిలో కొన్నిపిల్లర్లు కుంగిపోయి, బ్యారేజి ప్లాట్ ఫారం ఒకచోట చీలిందంటేనే నాణ్యత ఎంత నాసిరకంగా ఉందో బయటపడింది.
కళ్ళెదుటే నిర్మాణంలోని నాణ్యత బయటపడినా ఇంకా కేటీయార్ బుకాయించటమే ఆశ్చర్యంగా ఉంది. సీఎం, మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేసన్ ఇన్జనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కేసీయార్ ఇష్టప్రకారమే జరిగిందని స్పష్టంగా చెప్పారు. ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ కూడా నాణ్యతలో లోపాలున్నట్లు అంగీకరించింది. ఇంత జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం అద్భుతమని కేటీయార్ అబద్ధాలు చెప్పటమే విచిత్రంగా ఉంది.