అన్నీ రాజకీయాల కోణంలో చూడడం అలవాటైపోయిన నేటి రోజుల్లో.. మంత్రి కేటీఆర్ మాత్రం అంతో ఇంతో కొంత డిఫెరెంట్‌గానే వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆయన రాజకీయాలకు అతీతంగా.. వ్యవహరించి.. నెటిజన్ల మెప్పు పొందుతున్నారు. మాజీ ఎంపీ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు కొండా అనిందిత్ రెడ్డికి అభినందనలు తెలిపారు కేటీఆర్.
వాస్తవానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత టీఆర్ ఎస్ టికెట్‌పై చేవెళ్ల నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, అనూహ్యంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలుచేసి.. బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ కూడా పొసగక.. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. సో.. ఇలా చూసుకుంటే.. కొండా కుమారుడిని కేటీఆర్ పలకరించనే కూడదు!
కానీ, కేటీఆర్ అలా చేయలేదు. ప్రతిభను గుర్తించి, కొండా కుమారుడికి విషెస్ చెప్పారు. ఇంతకీ విషయం ఏంటంటే.. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలలో ఇండియన్ రేసింగ్ లీగ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్, హీరో నిఖిల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిందిత్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ `ఆల్ ది బెస్ట్` చెప్పారు. ఆయన బాగా ఆడాలని కూడా సూచించారు. కాగా, అనిందిత్ రెడ్డి హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ నుంచి బరిలో ఉన్నాడు.
ఇక, అనిందిత్ రెడ్డి రేస్‌లో పాల్గొనడం ఇదే తొలిసారికాదు. ఆయనకు రేసింగ్ లో 7 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో యూరో JK 16 ఛాంపియన్ షిప్, 2017లో యూరో జేకే ఛాంపియన్ షిప్ లలో విన్నర్ గా కూడా నిలిచాడు. అంతేకాదు మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 2017 మోటార్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
కాగా ఈ ఫార్ములా రేసును హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ రేస్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు పాల్గొంటాయి. ఆరు జట్ల నుంచి 12 కార్లు..24 మంది డ్రైవర్లు రేసులో ఉన్నారు. ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఇక లీగ్ ఫార్మాట్ ప్రకారం పోటీలు 4 రౌండ్లలో జరగనున్నాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ రౌండ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుండగా, 2, 3 రౌండ్లు మాత్రం చెన్నైలో జరగనున్నాయి. ప్రతి రౌండ్ రెండు రోజుల పాటు జరగనుంది. ఆదివారం 3 స్ప్రింట్ రేసులు నిర్వహించనున్నారు. మూడు స్ప్రింట్ రేసులో టాపర్ గా నిలిచిన జట్టుకు 25 పాయింట్లు లభిస్తాయి. రెండో స్థానంలోని జట్టుకు 18, మూడో స్థానంలో నిలిచిన టీమ్ కు 15 పాయింట్లు లభిస్తాయి.
Flagged off the #IndianRacingLeague today & looking forward to the #FormulaERace in February #HappeningHyderabad pic.twitter.com/BS0R0XpaPR
— KTR (@KTRBRS) November 19, 2022