మరి కొన్ని గంటల్లో భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 జరగాల్సి ఉండగా.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్‌ను ఆపేయాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌ను బుధవారం ఆడించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఐతే ఇది జట్టులో కరోనా వ్యాప్తిని అనుసరించి ఉంటుంది. కృనాల్‌తో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కలిపి ఎనిమిది మందిదాకా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లందరికీ మరో రౌండు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో అందరికీ నెగెటివ్ వస్తేనే మ్యాచ్ బుధవారం అనుకున్న ప్రకారం జరుగుతుంది. లేదంటే ఈ మ్యాచే కాదు.. సిరీసే ప్రమాదంలో పడొచ్చు.
పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగానే భారత్, శ్రీలంక రెండు జట్లనూ ఐసోలేషన్‌కు తరలించారు. ఓవైపు కోహ్లి నేతృత్వంలోని ప్రధాన జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. ధావన్ నాయకత్వంలో మరో జట్టును ఎంపిక చేసి మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం శ్రీలంకకు పంపడం తెలిసిందే. ఈ సిరీస్ ఆరంభానికి ముందు లంక జట్టులో కొన్ని కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ నెల 13న మొదలు కావాల్సిన వన్డే సిరీస్‌ను 18వ తేదీకి వాయిదా వేశారు.
వన్డే సిరీస్ సజావుగానే సాగిపోయింది. అందులో భారత్ 2-1తో నెగ్గింది. టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌నూ భారతే గెలిచింది. రెండో టీ20లో నెగ్గి సిరీస్ చేజిక్కించుకుందామనుకుంటే కరోనా షాకిచ్చింది. సిరీస్‌లో చివరిదైన మూడో టీ20ని శుక్రవారం నిర్వహించాల్సి ఉంది. మరి కరోనా ఏం చేస్తుందో ఏమో చూడాలి. బుధవారం రెండో టీ20 జరిగే పరిస్థితి లేకుంటే మొత్తంగా ఈ సిరీస్ ఇంతటితో ఆగిపోతున్నట్లే.