ఐపీఎల్ విజేతగా ముంబయి ఇండియన్స్ విజయం సాధించటం తెలిసిందే. వరుస పెట్టి విజయం సాధిస్తున్న ముంబయి ఇండియన్స్.. తాజాగా టైటిల్ సొంతం చేసుకోవటంతో మస్తు ఖుషీగా ఉంటున్నారు. ఇక.. ఆ జట్టులోని సభ్యుల ఆనందానికి అంతం లేకుండా పోయింది. విజయానందంలో ఉన్న క్రికెటర్లు కొందరు ఫైనల్ అయ్యాక.. కాస్త విశ్రాంతి తీసుకొని స్వదేశానికి బయలుదేరారు. అలా వచ్చిన క్రికెటర్లలో ఒకరు కృనాల్ పాండ్య. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఆయన డీఆర్ఐ (ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్సు) అధికారుల తనిఖీల్లో దొరికిపోయినట్లు చెబుతున్నారు.
భారత చట్టాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారు ఎవరైనా సరే.. అనుమతించిన పరిమితికి మించిన విలువైన వస్తువుల్ని తీసుకురాకూడదు. అందుకు భిన్నంగా కృనాల్ తన వెంట తెచ్చిన ఖరీదైన రెండు వాచ్ లతో అతనికి కొత్త తిప్పలు ఎదురయ్యాయి. పరిమితికి మించిన విలువైన వస్తువులు ఉండటంతో అతడ్నిఅదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.
కృనాల్ పాండ్య వద్ద రెండు ఖరీదైన రోలెక్స్ వాచ్ లతో పాటు.. మరో రెండు ఖరీదైన వాచ్ లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంత బంగారాన్ని కూడా కొనుగోలు చేసి తీసుకురావటం.. అవన్నీ పరిమితికి మించిపోవటంతో అతడ్ని అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టులోనే కాసేపు ఉంచేసి విచారణ చేపట్టారు. అనధికారిక లెక్కల ప్రకారం కృనాల్ తీసుకొచ్చిన వాచ్ ల విలువే రూ.75 లక్షలు వరకు ఉంటుందని చెబుతున్నారు.
తాను కావాలని తప్పు చేయలేదని.. అవగాహన లోపం వల్ల జరిగినట్లుగా అధికారులకు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను.. తన సోదరుడు కలిసి రెండు వాచ్ లు కొన్నామని.. తన సోదరుడు హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిపోవటంతో.. అతడి వాచ్ లను కూడా తాను తీసుకొచ్చానే తప్పించి… కావాలని తప్పు చేయలేదని వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. విదేశాల నుంచి తీసుకొచ్చే ఖరీదైన వస్తువుల పరిమితుల మీద తనకు అవగాహన లేకపోవటం వల్లే.. ఇలా జరిగినట్లుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. అతడికి భారీ జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.