ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రాజకీయాలు హీటెక్కాయి. ఇక్కడ నుంచి విజయం సాధించిన టీడీపీ మాజీ నాయకుడు(ప్రస్తుతం వైసీపీకి మద్దతిస్తున్నారు) కరణం బలరామకృష్ణమూర్తి వర్సెస్.. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్‌ల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే ఆమంచి నోటి దురుసు ప్రదర్శిస్తున్నారు. కరణంపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. కరణం చీడ పురుగని, ఎక్కడ ఉంటే.. అక్కడ వివాదాలకు కేంద్రంగా మారతారని.. వైసీపీలో ఆయనకు చోటు లేదని.. మా నాయకుడు తెలియక చేర్చుకున్నాడని.. ఇలా ఆమంచి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే.. ఇది నాణేనికి ఓ వైపు కనిపిస్తున్న రాజకీయం. అదే నాణేనికి మరో వైపు.. కూడా ఉందని.. కరణం కేంద్రంగా కుట్ర రాజకీయం నడుస్తోందని అంటున్నారు విశ్లేషకులు. కమ్మ సామాజిక వర్గాన్ని కేంద్రంగా చేసుకుని.. వైసీపీలోని కీలక నాయకుడు.. మాజీ ఎంపీ ఒకరు.. ఆమంచిని పావుగా చేసుకుని.. ఈ కుట్రకు తెరదీశారని అంటున్నారు. వాస్తవానికి కరణం.. తనంతట తానుగా పార్టీ మారి.. వైసీపీలోకి రాలేదని.. కరణం కుమారుడు వెంకటేష్‌ను జిల్లాకు చెందిన ఓ మంత్రి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారని.. అయితే.. ఇప్పుడు సమీకరణలు ఫలించకపోవడం.. తమ హవాకు బ్రేకులు పడతాయనే భ్రమతోనే ఇలా.. కరణం కేంద్రంగా కుట్రలకు తెరదీశారని.. దీనికి కమ్మ ట్యాగ్‌ను కూడా వాడుకుంటున్నారని అంటున్నారు.
వాస్తవానికి కరణం రాక విషయంలో జగన్‌కు ఎలాంటి అభిప్రాయ భేదం లేదని పరిశీలకులు చెబుతు న్నారు. జిల్లాకు చెందిన మంత్రి చెబితేనే .. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని.. నియోజకవర్గం సమస్య వచ్చినప్పుడు కూడా ఇక్కడి నేతలకు పరుచూరు నియోజకవర్గాన్ని కేటాయించారని. ఎవరు ఏది బాగుం టే. అక్కడ రాజకీయం చేసుకోవాలని కూడా సూచించారని.. కానీ, ఇది నచ్చని.. కొందరు జిల్లాకు చెందిన నేతలతో కలిసిమాజీ ఎంపీ ఒకరు రాజకీయంగా ఈవిషయాన్ని దుమారం రేపారని అంటున్నారు. దీనికి అందివచ్చిన అవకాశంగా.. కమ్మ సామాజిక వర్గాన్ని వినియోగించుకున్నారనేది వారి వాదన.
అదేసమయంలో కరణం బలరాం.. దూకుడు గల నాయకుడే అయితే.. ఆమంచిపై ఎదురుతిరిగి.. పోరాటాలు చేయాలని అనుకుంటే.. ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందనే దానికి ఆమంచి వర్గం నుంచి కానీ.. తెరవెనుక ఉండి నడిపిస్తున్నవారి నుంచి కానీ సమాధానం లేదనేది విశ్లేషకుల మాట. కేవలం తమ వాడు.. తమకు సంచులు మోసిన నాయకుడు.. పొరుగు నియోజకవ ర్గంలోకి వెళ్లాల్సి రావడాన్ని జీర్ణించుకోలేక.. కరణంపై కులం కత్తి ఎత్తారని అంటున్నారు. గతంలో అద్దంకి నియోజకవర్గంలో రెండు తరాలుగా ఉన్న గొట్టిపాటి కుటుంబంతోనే కరణం చంద్రబాబు చేసిన.. సయోధ్యతో కలిసిపోయిన విషయాన్ని వారు తెరమీదకి తెస్తున్నారు. ప్రస్తుతం కరణంపై నోరు పారేసుకుంటున్న నాయకులు.. ప్రజానాడిని గమనించలేక పోతున్నారనేది కూడా వీరి వాదన. ఏదేమైనా.. కరణంపై కుట్ర సాగుతోందని.. తెరవెనుక ఉన్న మాజీ ఎంపీ.. బయటకు వస్తే.. అసలు బండారం బయట పడుతుందని చెబుతున్నారు.