‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఒక ప్రాంతీయ భాషలో రూ.30 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్లో సినిమాలు తీసే హీరో ‘బాహుబలి’ తర్వాత.. రూ.300-400 కోట్ల ఖర్చులో సినిమాలు చేసే స్థాయికి చేరిపోయాడు. దేశవ్యాప్తంగా అతడికి తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది.
బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు ప్రభాస్‌తో సినిమా చేయడానికి తహతహలాడిపోతున్నారు. అతడి పట్ల తమ ఆరాధ్య భావాన్ని చాటుతున్నారు. ప్రభాస్ తమ ఫేవరెట్ అని చెప్పుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు.
తాజాగా కృతి సనన్ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రభాస్ పట్ల తన ఇష్టాన్ని ఆమె దాచుకోలేదు. ప్రస్తుతం కృతి.. ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వీళ్లిద్దరూ రాముడు-సీత పాత్రలు పోషిస్తున్నారు. తెరపై భార్యాభర్తలుగా దర్శనమివ్వనున్నారు.
ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ల పేర్లు ఇచ్చి.. ఈ మగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడిగితే ఆమె మరో ఆలోచన లేకుండా ప్రభాస్ పేరు చెప్పింది. మరి డేట్ ఎవరితో చేస్తావని అడిగితే టైగర్ ష్రాఫ్ అని బదులిచ్చింది.
కార్తీక్ ఆర్యన్‌ను మాత్రం తాను ఫ్లర్ట్ చేస్తానని చెప్పింది. ప్రభాస్ తన ఫేవరెట్ కోస్టార్లలో ఒకడని కూడా కృతి చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్ ముంబయిలోనే ఉంటూ ‘ఆధిపురుష్’ షూటింగ్లో పాల్గొంటున్నాడు.
ప్రభాస్, కృతి కలిసి ఒక పార్టీకి హాజరవుతున్న ఫొటోలు కూడా నెట్టింట దర్శనమిస్తున్నాయి. ‘ఆదిపురుష్’ కృతి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మిమి’తో కృతి చాలా మంచి ఫలితాన్నే అందుకుంది. నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ చిత్రానికి అదిరిపోయే రివ్యూలొచ్చాయి. ఇండియాలో ఈ ఏడాది వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది.