బాలీవుడ్ భామ కృతి సనన్ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అందుక్కారణం ప్రభాస్ నటించబోయే ‘ఆదిపురుష్’ సినిమాలో ఆమె సీత పాత్రను పోషించబోతోందున్న సమాచారం వల్లే. ఈ పాత్రకు ముందు రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. చివరికి కృతినే ఖరారైనట్లు బాలీవుడ్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కృతి వార్తల్లో నిలిచింది.
ఐతే ఇప్పుడు ఆమె పేరు మరో రకంగా వార్తల్లోకి వచ్చింది. కృతి ఇటీవలే కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె హోమ్ క్వారంటైన్ అయిందట. తీవ్ర లక్షణాలేమీ లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేనట్లు తెలుస్తోంది. వైద్యుల సలహాలతో ఇంటిపట్టునే ఉండి చికిత్స తీసుకోనుందట. తర్వాత అవసరమైతే ఆసుపత్రిలో చేరాలని భావిస్తోందట.
కృతి ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కానీ.. ఆమె కథానాయికగా తొలి అడుగులు వేసింది తెలుగులోనే. మహేష్ బాబు లాంటి అగ్ర కథానాయకుడితో తన తొలి సినిమా చేసే అవకాశం దక్కించుకుందామె. వీరి కలయికలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ డిజాస్టర్ కావడంతో తెలుగులో ఆమెకు ఆశించిన ఆరంభం దక్కలేదు. తర్వాత నాగచైతన్య సరసన చేసిన ‘దోచేయ్’ సైతం డిజాస్టరే కావడంతో ఆమె మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు.
హిందీలో చేసిన ‘హీరో పంటి’ సహా కొన్ని సినిమాలు బాగానే ఆడాయి. కెరీర్ మరీ గొప్పగా ఏమీ సాగకపోయినా.. నాట్ బ్యాడ్ అన్నట్లే ఉంది. ఇలాంటి తరుణంలో ‘ఆదిపురుష్’ లాంటి భారీ ప్రాజెక్టులో ప్రభాస్ సరసన నటించే అవకాశం కృతిని వరించడం నిజమే అయితే.. ఆమె కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఛాన్స్‌గా చెప్పాలి. ఈ సినిమా అంచనాలను అందుకుంటే కృతి కెరీర్ మారిపోవడం ఖాయం. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.