రాష్ట్రంలోని చాలా జిల్లాలకు దక్కని ఛాన్స్ కృష్ణాజిల్లాకు దక్కింది. ఒక జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కడం చాలా అరుదుగా జరిగే సంఘటన. ముఖ్యంగా పెద్ద జిల్లా అయిన.. తూర్పుగోదావరిలో ఈతరహా లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అదేవిధంగా కృష్ణాలో ముగ్గురికి జగన్ అవకాశం ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు దేవదాయ శాఖ మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఇక, జిల్లాలోని గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని కి పౌరసరఫరాలు, కీలమైన మచిలీపట్నం నియోజ కవర్గం నుంచి విజయం సాధించిన పేర్నినానికి సమాచార శాఖను అప్పగించారు.
సరే.. శాఖలు ఏవైనా.. మంత్రులుగా ఉన్న ఈ ముగ్గురు జిల్లాకు ఏం చేశారు? ఏం చేస్తున్నారు? అనేది నెటి జన్లు సంధిస్తున్న ప్రధాన ప్రశ్న. సాధారణంగా మంత్రులుగా అవకాశం చిక్కడం చాలా కష్టం. అలాంటి అవకాశం దక్కించుకున్న ముగ్గురు.. తమ జిల్లాకు ఎంతో కొంత చేయాలనే తపనతో ముందుకు సాగుతా రు. కానీ, ఈ ముగ్గురులో ఈ తరహా తపన ఎక్కడా కనిపించడం లేదన్నది.. నెటిజన్ల మాట. తమ తమ శాఖల వ్యవహారాలకే పరిమితమై పోతున్నారు తప్ప.. జిల్లా అభివృద్ధిలో వీరు ఎక్కడా జోక్యం చేసుకోలేక పోతున్నారనేది ప్రధాన విమర్శ. విజయవాడ నగరాన్ని తీసుకుంటే.. ఏలూరు రోడ్డును విస్తరించాలనే ప్రతిపాదన ఉంది. ఇది గత టీడీపీ హయాంలోనే అధ్యయనానికి కూడా నోచుకుంది. అయితే.. ఎన్నికలు రావడంతో మూలనపడింది.
విజయవాడలో కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇవ్వాలనే ప్రతిపాదన, వారికి మౌలిక వసతులు కల్పించడంతోపాటు.. ఇంద్రకీలాద్రి చుట్టూ ఉన్న సొరంగ ప్రాంతం సహా ఇతర కాలినడక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.. వీటిని పట్టించుకుని అభివృద్ధి చేయడం ద్వారా విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించడంతోపాటు.. మరిన్నిసౌకర్యాలు వస్తా యి. ఇక, కృష్ణానది పక్కనే ఉన్నా.. జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు నీటి సదుపాయం లేక.. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణానదిపై రెండు ప్రాజెక్టులు కట్టి.. సముద్రంలో కలిసే నీటిని.. సాగునీటికి మళ్లించాలనే ప్రతిపాదనలు మూలుగుతున్నాయి.
అయినప్పటికీ.. జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నానిలు ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలేదు. ఇక, జిల్లాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గన్నవరం శివారులో గత చంద్రబాబు ప్రభుత్వం కొంత భూమిని కేటాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిపాదన కూడా మూలన పడింది. దీనిని పట్టించుకుని అభివృద్ధి చేసినా.. జిల్లా ఆర్థికంగా మరింత పురోగమించేందుకు అవకాశం ఉంటుంది. ఇక, గుణదల ప్రాంతంలో దాదాపు నాలుగు ప్రధాన ప్రాంతాలకు ఇబ్బందిగా ఉన్న రైలు మార్గంపై బ్రిడ్జ్‌ను నిర్మించాలనే ప్రతిపాదన.. సగం వరకు వచ్చి ఆగిపోయింది.
మచిలీపట్నంలో పోర్టుల ప్రతిపాదన ఎట్టకేలకు కదలడం ఒక్కటే చెప్పుకోదగ్గ పరిణామం. సో..ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నెటిజన్లు.. ముగ్గురు మంత్రులు ఉన్నా.. జిల్లాకు ఒరిగింది ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరో ఆరేడు మాసాల్లో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగి.. వీరిలో ఏ ఇద్దరు పక్కకు తప్పుకొన్నా.. ఇలాంటి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉండదని.. సో.. ఇప్పటికైనా.. రాజకీయ దూకుడు తగ్గించి జిల్లా మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఐటీ విధానంపై దృష్టి పెట్టాలన్నది నెటిజన్ల సూచన. మరి ఈ మంత్రులు ఏం చేస్తారో చూడాలి.