ఫోన్ ట్యాపింగ్ అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే కోటంరెడ్డిపై వేటు వేసిన వైసీపీ అధిష్టానం…నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జీవితాంతం జైల్లో ఉంచినా తన గొంతు నొక్కలేరని, ఎన్ కౌంటర్ చేస్తేనే తన గొంతు మూతపడుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
సజ్జలతో పాటు ఇతర వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి సలహాదారుడిగా ఉండేంత పరిజ్ఞానం సజ్జలకుందని, అందుకే తన అరెస్టుకు రంగం సిద్ధం అంటూ లీక్ లిస్తున్నారని ఆరోపించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. థియేటర్ ఓనర్ల నుంచి నెలకు 2 లక్షలు వసూలు చేస్తున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు.
డిసెంబర్ 25న తానే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నానని, అదే రోజున చంద్రబాబును కలిశానంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని కోటంరెడ్డి అన్నారు. టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిందన్న ఆరోపణలను కోటంరెడ్డి తోసిపుచ్చారు. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎన్నికల వేళ స్పష్టమవుతుందని కోటంరెడ్డి అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమించానని, కానీ, ఇప్పుడు తనను అనుమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే పార్టీకి దూరమవుతున్నానని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ప్రభుత్వంలో కొంతమంది పెద్దల హస్తం ఉందని అన్నారు. అయితే, మౌనంగా తప్పుకుందామని అనుకున్నానని, కానీ, తనపై ఆరోపణలు చేయడంతో ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని కోటంరెడ్డి చెప్పారు.