వైసీపీ నేతలు, మంత్రులు, సలహాదారులపై అ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా సొంత జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి సెటైర్లు వేశారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు బావా కాకాణి అంటూ కోటంరెడ్డి చురకలంటించారు. వైసీపీని వీడాలనుకున్న తర్వాతే టీడీపీవైపు మళ్లానని, అందుకే తాను ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్పారు.
కాకాణని జడ్పీ చైర్మన్ గా చేసిన ఆనం రామ నారాయణరెడ్డి వ్యతిరేకంగా ఆయన ఎలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పొదలకూరులో వైఎస్ విగ్రహం పెట్టనీయకుండా గతంలో కాకాణి అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా అని ప్రశ్నించారు. నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు వేళ్లన్నీ కాకాణి వైపే చూపిస్తున్నాయని, ముందు కాకాణి ఆ సంగతి చూసుకోవాలని చురకలంటించారు.
ఇక, సజ్జలపై కూడా కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. అనిల్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించారని, ఆ వ్యక్తి సజ్జల కోటరీకి చెందిన వాడని తనకు తర్వాత తెలిసిందని అన్నారు. సజ్జల నాకు ఇలాంటి కాల్స్ చేస్తే నీకు నెల్లూరు రూరల్ నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తుల బెదిరింపులకు బెదిరేరకం తాను కాదని అన్నారు. 22వ డివిజన్ కార్పొరేటర్ భాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ కోటంరెడ్డిపై కేసు నమోదైంది.
దీనిపై కూడా ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం భాస్కర్ రెడ్డి తన వెంటే ఉంటానని వచ్చాడని, కానీ నిన్న కారు దగ్గరికి వచ్చి బాధగా ఉందంటూ హత్తుకుని ఏడ్చారని కోటంరెడ్డి చెప్పారు. ఆ తర్వాత కిడ్నాప్ కేసు పెట్టారని విమర్శించారు.