వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాసిపెట్టుకోండి.. 2024 ఎన్నికల్లో వైసీపీని డిస్మిస్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు“ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. 2024 ఎన్నికల్లో రాజకీయ సునామీ రాబోతోందని చెప్పారు. అప్రజాస్వామిక పద్ధతిలో, అధికార మదంతో వెళ్తున్న జగన్‌ను, వైసీపీని రానున్న 2024 ఎన్నికల్లో శాశ్వతంగా ఏపీ రాజకీయాల్లో నుంచి డిస్మిస్ చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిప్పులు చెరిగారు.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఓటమి ప్రజానాడి ఏంటో చాటి చెబుతోందని కోటంరెడ్డి తెలిపారు. “నేను నమ్మకంగా, విశ్వాసంగా చెబుతున్నా రాసిపెట్టుకోండి.. 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు సాయంత్రం మాట్లాడుకుందాం“ అని కోటంరెడ్డి బహిరంగ సవాల్ రువ్వారు. తాను మూడు తరాలుగా వైఎస్ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నానని ఆయన వివరించారు. కష్టాల్లో పార్టీకి విధేయుడిగా ఉన్నానన్నారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తాను నమ్మకమైన వ్యక్తిగా.. కార్యకర్తగా ఉన్నానని కోటంరెడ్డి తెలిపారు.
అయితే.. ఇటీవల కాలంలో తాను ప్రజా సమస్యలను పరిష్కరించాలని జగన్‌ను గట్టిగా అడిగినట్టు చెప్పారు. ప్రజల నుంచి ఎంత ఒత్తిడి ఉంటే.. శ్రీధర్ రెడ్డి ఇంతలా అడుగుతున్నారని సీఎం జగన్ అనుకోలేదని, తాను అడిగిన ఈ సమస్యలను రాజకీయ కోణంలో చూశారని విమర్శించారు. అందుకే అప్పట్నుంచీ అధిష్ఠానం తనను అనుమానిస్తూ వస్తోందన్నారు. అనుమానం ఉన్నచోట ఉండకూడదని ఆత్మ గౌరవంతో రెండు నెలల ముందే తాను వైసీపీకి దూరమయ్యానని వివరించారు.
“మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ కి నమ్మకం సన్నగిల్లిందనే నేను బయటికొచ్చేశాను. నాటి నుంచి నేటి వరకూ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా నేను లేను. అలాంటప్పుడు నన్ను సస్పెండ్ చేయడం సమర్థనీయమే. నేను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా.. ఏం చేసినా వెనకడుగు వేసేది లేదు. ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాను“ అని కోటంరెడ్డి వివరించారు.