తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన ప్రకటన వైసీపీలో పెను దుమారం రేపింది. వైసీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోటంరెడ్డి తన ఫోన్ ను ట్రాప్ చేస్తున్నారని బహిరంగ విమర్శలు చేయడం సంచలనం రేపింది. ఆ వ్యవహారం సద్దుమణగకముందే తాజాగా కోటంరెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతున్న సంచలన ఆడియో క్లిప్ ఒకటి లీక్ కావడం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది.
తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు ఊస్టింగ్ అవుతాయని కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆడియో బహిరంగంగా లీక్ అయితే వైసీపీ ప్రభుత్వం షేక్ అవుతుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అంశంపై విచారణ జరుపుతుందని కోటంరెడ్డి వ్యాఖ్యానించినట్లుగా ఆ ఆడియో లీక్ తో ప్రచారం జరుగుతోంది.
ప్రజల మేలు కోసమే తాను పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడానని కోటంరెడ్డి అన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని తన సన్నిహితులతో జరిగిన సమావేశం సందర్భంగా కోటంరెడ్డి చేసినట్లుగా ప్రచారమవుతున్న ఈ ఆడియో వ్యవహారం పెనుదుమారం రేపుతోంది. అయితే, ఆ లీకైన ఆడియో క్లిప్ లోని వాయిస్ కోటంరెడ్డిదేనని నిర్ధారణ కాలేదు. మరోవైపు, కోటం రెడ్డి తరహాలోనే సీనియర్ పొలిటిషియన్, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా సొంత పార్టీనే తన ఫోన్ ట్యాప్ చేస్తోందంటూ చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయ కాక రేపుతున్నాయి.