వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాహాటంగానే టిడిపి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇచ్చి వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జరుగుతున్న సందర్భంగా కోటంరెడ్డి పూర్తి స్థాయిలో పాదయాత్రకు మద్దతుగా నిలిచారు. కోటంరెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.
కోటంరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సముచిత స్థానం కల్పించారు. టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నియమించింది. ఈ ప్రకారం టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం శ్రీధర్ రెడ్డిని నియమించామని తెలిపారు. ఈ ప్రకారం కోటంరెడ్డి కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. వైసీపీపై తిరుగుబాటు నేతగా ఉన్న శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ లో మంచి పట్టు ఉందని, అందుకే వైసీపీకి చెక్ పెట్టేందుకు కోటంరెడ్డికి టికెట్ ఇవ్వడం సరైన నిర్ణయం అని టీడీపీ అధినేత భావించారట. అయితే, వైసీపీ నుంచి వచ్చిన కోటంరెడ్డికి టికెట్ ఇస్తే స్థానికంగా ఏళ్ల తరబడి టీడీపీని నమ్ముకున్న నేతలు నిరుత్సాహ పడే అవకాశముందని, వారిని బుజ్జగించి టికెట్ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.