వైసీపీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి….జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టెపాలెం వద్ద బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ 8 గంటల జలదీక్షకు కోటంరెడ్డి పిలుపునిచ్చారు. అయితే, కోటంరెడ్డి నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు.
కోటం రెడ్డి తన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై మండిపడ్డ కోటంరెడ్డి ఇంటి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో, కోటంరెడ్డి అనుచరులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి దగ్గరకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా కోటంరెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేనేమన్నా డాన్ నా…నా ఇంటి చుట్టూ ఇంతమంది పోలీసులున్నారు అంటూ పోలీసులపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దీక్ష చేసి తీరుతానని, డ్యూటీలు మానేసి ఎంతో కాలం తన చుట్టూ పోలీసులు తిరగలేరని అన్నారు.
జల దీక్షకు అనుమతినివ్వాలని ఎస్పీని, డిఎస్పీని కోరానని, ఏమైనా అనుమానం ఉంటే తనను అడగొచ్చు కదా అని అన్నారు. వంతెన నిర్మాణం ఫైల్ పై జగన్ సంతకం చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఏరియాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.