వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలపై తన పోరాటం తుది వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తగ్గేదేలా.. అంటూ.. ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. తన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లేవనెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆగబోదని.. శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారం కోసం జలదీక్షకు దిగిన తనను పోలీసులు అన్యాయంగా గహనిర్బంధం చేశారని విమర్శించారు.
ఈ నెల 13 నుంచి ‘జనం మాటలు విందాం రండి’ అనే కార్యక్రమం చేపడతానని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే జలదీక్ష రూపంలో ఆందోళనకు దిగానని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. శాంతియుత నిరసనను ప్రభుత్వం గృహనిర్బంధంతో అడ్డుకోవడం సరికాదన్నారు. ఇదిలావుంటే.. పోలీసులు గురువారం తెల్లవారు జామున 5 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కోటంరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు.
గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కా రం కోసం ముఖ్యమంత్రిని అనేక సార్లు కలిసి అడిగినా స్పందన లేదన్నారు. ముఖ్యమంత్రి సంతకానికే విలువ లేకుంటే రాష్ట్రంలో ఏం జరుగుతోందని కోటంరెడ్డి మండిపడ్డారు. పొట్టేపాలెం కలుజు, ములుమూడి కలుజు వద్ద వంతెనలు నిర్మించాలని కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నెరవేరలేదని విమర్శించారు.
తనను గృహ నిర్భంధంలో ఉంచినంత మాత్రాన నిరసనలు ఆగవని, ఇంకా వేగంగా ముందుకు దూసుకుపోతానని చెప్పారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలో అనేక ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అమరావతిలో గాంధీగిరి పద్ధతిలో చేపట్టిన విధంగా ఇక్కడ కూడా నిరసనలు కూడా చేస్తానని చెప్పారు. నెల్లూరు రూరల్‌లో ఈ నెల 13 నుంచి ‘జనం మాటలు విందాం రండి’ అనే కార్యక్రమం చేపడతానని చెప్పారు.