అక్టోబరు 9, 2022 న కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో జరిగిన వీక్షణం సాహితీ వేదిక 122 వ సమావేశంలో ప్రముఖ కవి కొప్పర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని “ఆధునిక కవిత్వ మార్గాలు- ఇస్మాయిల్ కవిత్వం” అనే అంశమ్మీద ప్రసంగించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియా లో “వీక్షణం” సాహితీ వేదిక గత పదేళ్ల నించి నెలనెలా సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతున్నది.
ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు.
కొప్పర్తి గారిని డా.కే.వి.రమణారావు సభకు పరిచయం చేసారు.
కొప్పర్తి పూర్తి పేరు కొప్పర్తి వెంకటరమణ మూర్తి.
విశ్రాంత చరిత్ర ఉపన్యాసకులు అయినప్పటికీ మొదట్నించీ కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు.
దాదాపు నలభై ఏళ్ల నించి కవిత్వం రాస్తున్నారు.
పిట్టపాడే పాట, విషాదమోహనం, యాభైఏళ్ళవాన అనే మూడు కవితా సంపుటులు వెలువడ్డాయి.
కొప్పర్తి ‘ఆధునిక కవిత్వ మార్గాలు- ఇస్మాయిల్ కవిత్వం’ అనే అంశమ్మీద మాట్లాడుతూ ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి వస్తు పరంగా వచ్చిన భేదాల్ని ముందుగా వివరించారు.
తరువాత గురజాడ, శ్రీశ్రీ, ఇస్మాయిల్ కవిత్వాల్లో ఉన్న విశేషాంశాల్ని వివరిస్తూ శ్రీశ్రీ తరువాత ఆధునిక కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి ఇస్మాయిల్ అని కొనియాడారు.
ఇస్మాయిల్ కవిత్వాన్ని స్వచ్ఛమైన నీటితో పోలుస్తూ దాహార్తికి నీరు ఎంత అవసరమో ఆధునిక కవులకు ఇస్మాయిల్ కవిత్వం అంత అవసరం అన్నారు.
ఇస్మాయిల్ కవిత్వంలో వాహకం, వాహిక రెండూ కవిత్వమే అన్నారు.
దేనినైనా మనందరం చూసే సాధారణ దృష్టితో కాక దివ్యనేత్రంతో కొత్తగా దర్శించి కవిత్వీకరించటమే ఇస్మాయిల్ గారి ప్రత్యేకత.
హైకూలను మొట్టమొదటగా పరిచయం చేసిన కవి ఇస్మాయిల్.
“తొలిసంజె నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు”
“బుద్ధిగా ప్రేమించుకోక యుద్ధమెందుకు చేస్తారో నాకర్ధం కాదు”
“ఏ కాకీ ఎగరని ఏకాకి ఆకాశం”
“తరుచాపము వీడిపోయి గురి మరచిన బాణంలా తిరుగుడును పిట్ట”
అంటూ ఇస్మాయిల్ తన కవిత్వంలో అలవోకగా, సరళంగా, అనితరసాధ్యంగా రాసిన అనేక విశేషాంశాల్ని సోదాహరణంగా సభకు అత్యంత ప్రతిభావంతంగా వివరించారు కొప్పర్తి.
ఒక్కొక్క కవిత ఒక్కొక్క ఆణిముత్యంగా భావించవచ్చని, ఇస్మాయిల్ కవిత్వం గురించి ఎంత సేపు చెప్పుకున్నా తరగనిదని అంటూ దాదాపు గంటసేపు ఉపన్యసించారు.
ఆయన అనుయాయులుగా కవిత్వం రాస్తున్న కవులు “ఇస్మాయిల్ స్కూల్” కి చెందిన వారమని గర్వంగా చెప్పుకునే గొప్ప కవి ఇస్మాయిల్ అని ముగించారు.
ఈ సభలో స్థానిక ప్రముఖులు డా. అక్కిరాజు రమాపతిరావు, కిరణ్ ప్రభ, కాంతి కిరణ్, డా.కె.గీత, సుభాష్ పెద్దు, వేణు ఆసూరి, డా.కే.వి.రమణారావు, శారద కాశీవఝల, శ్రీధర్ రెడ్డి , సుభద్ర ద్రోణంరాజు, మృత్యుంజయుడు తాటిపాముల మున్నగువారు అనేకులు పాల్గొన్నారు.
ఈ సమావేశాన్ని యూట్యూబులో ఇక్కడ చూడవచ్చు.